వర్షాకాలం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. కానీ అది అంత సులువైన పని కాదు. వర్షాకాలం మొదలైందంటే చాలు ఇక వర్షాలు రోజూ పడుతూనే ఉంటాయి. ఆ సమయంలో బట్టలు ఎండడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. వర్షాకాలంలో ఉతికిన బట్టల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం.
ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల దుస్తులు ఆరుబయట కూడా సరిగ్గా ఆరవు. ముట్టుకుంటే ఆరినట్లుగా అనిపించినప్పటికీ.. వాటి పోగుల్లో తేమ ఇంకా నిలిచే ఉంటుంది. ఆ దుస్తులు సరిగ్గా ఆరక వాటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇక ఇలాంటి దుస్తుల్ని మడతపెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టామంటే వాటిలో ఫంగస్ వృద్ధి చెంది అదో రకమైన వెగటు వాసన రావడం, అదే వాసన తాజాగా ఉన్న బట్టలకూ పట్టడం, ఇళ్లంతా నిండిపోవడంతో విసుగొచ్చేస్తుంటుంది.
అయితే బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వాషింగ్ మెషిన్ ను కొంతమంది లాండ్రీ బాస్కెట్ లా వాడతారు. ఈ అలవాటు వల్ల బట్టలను ఉతికినా వాటిపై దుర్వాసన అలాగే ఉంటుంది. అందుకే ఉతికేటప్పుడు మాత్రమే బట్టలను వాషింగ్ మెషిన్ లో వేసి ఆ తరువాత వాటిని ఆరేయాలి.
అలాగే వాషింగ్ మెషిన్ లో బట్టలను ఉతికేశాక ఎక్కువసేపు వాటిని మెషిన్ లోనే ఉంచకూడదు. వెంటనే వాటిని మెషిన్ లోంచి తొలగించాలి. ఉతికిన బట్టలను ఎక్కువసేపు వాషింగ్ మెషిన్ లోనే ఉంచితే బట్టలకు చెడువాసన పట్టుకుంటుంది. కాబట్టి, వాష్ చేసిన వెంటనే వాటిని ఆరేయాలి.
బట్టల నుంచి వచ్చే చెడు వాసనను తొలగించే ప్రక్రియలో భాగంగా ఉతికే పద్ధతిని మార్చుకోవాలి. బట్టలను తిరగేసి ఉతికితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే, చెమటవంటివి లోపలివైపుకు అతుక్కుని ఉంటాయి. బట్టలను తిరగేసి ఉతికితే చెడు వాసన పోతుంది.
వర్షాకాలంలో సరిగ్గా ఆరని దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనను నిమ్మరసంతో దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొద్ది నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాసన వచ్చే దుస్తులపై స్ప్రే చేసి కాసేపు అలాగే గాలిలో ఆరేయాలి. ఈ వెగటు వాసనకు కారణమైన ఫంగస్‌ను నశింపజేసి సువాసనను వెదజల్లేందుకు నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది.
వెనిగర్, బేకింగ్ సోడా అనేది బట్టల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించేస్తాయి. వెనిగర్‌లో ఉండే ఆమ్ల స్వభావం దుర్వాసనకు కారణమైన ఫంగస్‌ను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి, బట్టలను ఉతికేటప్పుడు కాస్తంత వెనిగర్ ను అలాగే బేకింగ్ సోడా ను డిటర్జెంట్ లో కలిపితే చెడు వాసన రాదు.
చాక్స్ లేదా సిలికాన్ పౌచెస్ అనేవి గార్మెంట్స్ లోంచి వచ్చే చెడు వాసనను తొలగిస్తాయి. కాబట్టి, కొన్ని చాక్ పీసులను లేదా సిలికాన్ పౌచెస్ ను వార్డ్ రోబ్స్ లో పెట్టండి. ఇవి బట్టలను డ్రై గా ఉంచుతాయి.
ఇక వీటిని అలాగే వార్డ్‌రోబ్‌లో పెట్టేస్తే ఆ షెల్ఫ్స్ అన్నీ వాసనతో నిండిపోతాయి. అలాంటప్పుడు బ్లీచ్ చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ముందుగా వార్డ్‌రోబ్‌లో ఉన్న బట్టలన్నీ బయటికి తీసి.. బ్లీచ్ ద్రావణంలో ముంచిన తడిగుడ్డతో అరలన్నీ తుడిచేయాలి. ఆపై ఆరాక మళ్లీ దుస్తుల్ని ఎప్పటిలాగే సర్దేస్తే సరిపోతుంది. ఈ చిట్కా దుస్తుల దుర్వాసననూ దూరం చేస్తుంది.
బట్టలను ఇంట్లో రెండు మూడు రోజులవరకూ ఆరేసినా కూడా వాటిలో ఇంకా కాస్తంత చెమ్మ ఉందనిపిస్తే వాటిని మీరు ఇస్త్రీచేయండి. ఈ ప్రాసెస్ కూడా బట్టలనుంచి చెడువాసన రాకుండా హెల్ప్ చేస్తుంది.