Home Health సరిపోయేంత నిద్ర లేకపోతే ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసా

సరిపోయేంత నిద్ర లేకపోతే ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసా

0

తిండి తినకుండా కొన్ని రోజులైనా ఉండగలం నిద్ర లేకుండా కానీ 3 రోజుల మించి ఉండలేమన్నది జగమెరిగిన సత్యం. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇక్కడే అర్థం అవుతుంది ప్రతి మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతోంది ఈ నిద్రలేమి తోనే. సరిపోయేంత నిద్ర లేకపోతే ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Day Time Sleep Is Good Or Badనైట్‌ షిఫ్టులు, ఇతర పనుల రీత్యా.. రాత్రుళ్లు పూర్తిగా నిద్ర లేకపోవడం లేదంటే ఆలస్యంగా పడుకోవడం మనలో చాలామందికి అలవాటే. అలా అప్పుడు త్యాగం చేసిన నిద్రను ఏ ప్రయాణాల్లోనో, మధ్యాహ్నమో కవర్‌ చేస్తుంటాం. దీంతో రోజులో ఎప్పుడైనా ఎనిమిది గంటలు నిద్ర పోతే సరిపోతుందనుకుంటాం. కానీ ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. పైగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే పర్లేదు కానీ ఇదే రొటీన్ని దీర్ఘకాలం పాటు ఫాలో అయితే మాత్రం డిప్రెషన్‌, డయాబెటిస్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం ముఖ్యమని, అది కూడా రాత్రి సమయమే సరైనదని అంటున్నారు. అలాగే పగటి పూట ఓ కునుకు తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళలతో కలపకుండా రాత్రుళ్లు సుఖంగా ఏడెనిమిది గంటలు నిద్ర పోవడం ఆరోగ్యదాయకం అని సూచిస్తున్నారు.

శరీరానికి, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడానికి చాలామంది కాసేపు కళ్లు మూసుకొని అలా రిలాక్సవుతుంటారు. అంతమాత్రాన నిద్రపోయినట్లు కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మన శరీర అవయవాల పనితీరు వేర్వేరుగా ఉంటుందట. ముఖ్యంగా సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్సయి ఆలోచన సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సమర్థత పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఆ కొద్ది సమయంలో కూడా ఓ చిన్న కునుకు తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు.

అయితే పగటి పూట నిద్ర మంచిదా? కాదా? అనేది ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. చాలా మందికి పగటిపూట ఓ కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న ఉద్యోగస్తులు అయితే నానా ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది ఆఫీస్ మధ్యలో ఇంటికి వచ్చి ఎంచక్కా మధ్యాహ్నం కాసేపు ఒక కునుకు తీసి ఆఫీస్ కు వెళ్ళవచ్చులే అని ఆలోచిస్తారు. ఇక ఇంట్లో ఉండే మహిళామణులు పని పూర్తి అయ్యాక కాసేపు అలా కునుకు తీస్తుంటారు.

పగటి పూట ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పని చేసే ముందు కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు తెలిపారు. కునుకు వల్ల పనిలో ఏకాగ్రత వస్తుందని వెల్లడించారు. తద్వారా శరీర అవయవాలు మరింత చురుగ్గా పనిచేస్తాయంటున్నారు. కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం మేలు. అయితే ఎక్కువ సేపు నిద్రపోతే ప్రమాదమేనన్నది కొందరు పరిశోధకుల మాట.

పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వలన అల్జీమర్స్ (మతి మరుపు) వచ్చే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. పగటి పూట ఎక్కువ సమయం నిద్ర వల్ల తీసుకునే ప్రోటీన్లు మెదడకు చేరడం లేదని వారు గుర్తించారు. మనిషి నిద్రపోకుండా ఉంచే నాడి కణాలను పరిశీలించిన వైద్యులు… పగటి పూట నిద్రతో అవి చనిపోతున్నట్లు దీనితో మతిమరుపు సమస్యకు దారి తీస్తున్నట్లు నిర్ధారించారు. పగటిపూట ఎక్కువగా సేవు కునుకు తీయడం వల్ల మగతగా అనిపిస్తుంది. పైగా ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది.

పగటి పూట ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర పడుతుంది. మరీ తప్పదు అనుకుంటే 30 నిమిషాలకు మించకుండా ప్రయత్నించండి. ముఖ్యంగా సాయంసంధ్యవేళలలో అస్సలు నిద్రపోరాదు. సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది. నిద్రలేమి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం.

Exit mobile version