పొడి చర్మం ఉన్నవారు ఎన్ని క్రీములు, పౌడర్లు వాడినా చర్మం పగిలినట్టుగా ఉండడం, ఎండిపోయినట్లు నిర్జీవంగా కావడం ఉంటుంది. చాలా మంది ముఖం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం ఇలా అవుతూనే ఉంటుంది. ఇప్పుడంటే మనకు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి కానీ మన పూర్వ కాలంలో ఇప్పుడు ఉన్నంత నూనెలు కూడా అందుబాటులో లేవు. మొదట ఆముదం ఆయిల్ ను ఆరోగ్య రక్షణకు, చర్మం, జుట్టు వంటి సౌందర్య రక్షణ కోసం కూడా ఉపయోగించేవారు.
అది కూడా అందుబాటులో లేని సమయంలో పాలలో ఉండే మీగడను సౌందర్య పోషణ కోసం ఉపయోగించేవారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు పొడి చర్మం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మంలోని తేమ శాతం తగ్గిపోవడంతో పేలవంగా మారిపోతుంటుంది. దీనికి సరైన విరుగుడు మీగడ.. పాలమీది మీగడ పొడి చర్మానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా మొహానికి రాసుకోవడం వల్ల పొడి చర్మం ఆరోగ్యంగా, అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
అయితే ప్రస్తుతం మనం ఉపయోగించే పాలల్లో మీగడ తీసేసి ప్యాక్ చేస్తున్నారు. కొవ్వు లేని పాలు తీసుకుంటున్నాము కనుక మీగడ దొరికే అవకాశాలు తక్కువ. కానీ స్వచ్ఛమైన పాలలో దొరికే మీగడ తీసుకోవాలి. మొహం కాంతివంతంగా మెరిసిపోవాలంటే మీగడకు మించిన ఔషధం మరోటి లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం ఒక టేబుల్ స్పూన్ మీగడలో ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి కలిపి.. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి.. ఆరిన తరువాత కడిగేస్తే.. సహజకాంతి మీ సొంతం అవుతుంది.
మీగడలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టిమంచి మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. మీగడలోని సుగుణాలు.. మీచర్మానికి తేమను, పోషకాలను అందిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు, దెబ్బతిన్న చర్మ కణజాలాలను కూడా బాగు చేస్తుంది. మీగడను మొహం మీదే కాదు.. కాంతిహీనంగా మారిన శరీరంలోని ఏ భాగంలోనైనా వాడొచ్చు. మోకాలు, మోచేతుల మీద నల్లగా మారినచోట పాలమీగడలో నిమ్మరసం కలిసి రాసి, కాసేపయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చర్మం మీద ఇరిటేషన్ కలుగుతుంటే ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ క్రీమ్ కలపి, మొహానికి ప్యాక్ వేసుకోండి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. అది పూర్తయ్యాక, నీటితో శుభ్రం చేసుకోండి. ఎండవల్ల ఏర్పడే టాన్ ను తొలగించడంలో మీగడ చాలా బాగా పనిచేస్తుంది. సన్ బర్న్, సన్ టాన్ లకు కూలింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. దీనికోసం ఒక చెంచా నిమ్మరసంతో మీగడను కలిసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. మడమల పగుళ్లకు కూడా మీగడ అద్భుతంగా పనిచేస్తుంది. పగుళ్లున్న చోట క్రమం తప్పకుండా రాస్తే సున్నితమైన, మృదువైన మడమలు తయారవుతాయి.
అలాగే ముఖానికి వారంలో కనీసం నాలుగు సార్లు అయినా ఆవిరి పడుతూ ఉండాలి. ఒక గిన్నెలో నీళ్ళు మరగబెట్టి నీటిలో పొగలు వస్తున్నప్పుడు మూత సగం తెరిచి పెట్టడం వలన వచ్చే ఆవిరిని టవల్ తలపై నుండి మూసుకుని ముఖానికి ఆవిరి పట్టాలి. లేదా స్టీమ్ మిషన్తో నేరుగా ఆవిరి పట్టడం వలన చర్మకణాలు శుభ్రపడతాయి. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. ఆవిరి పట్టిన తరువాత మొహంపై పాలమీగడతో నెమ్మదిగా మసాజ్ చేయాలి.
ఇలా చేయడం వలన ఈ మీగడ చర్మకణాలులోకి వెళ్లి చర్మాన్ని మృదువుగా ప్రేమతో ఉండేలా చేస్తాయి. ఇలా మసాజ్ చేయడం వలన చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మంపై ఉండే నలుపుదనం, నిర్జీవంగా ఉండే చర్మం తాజాగా తయారవుతుంది. ఇలా మీగడతో మసాజ్ చేసిన తర్వాత సబ్బు ఉపయోగించకూడదు. సబ్బులోని కెమికల్స్, నురగలు వచ్చేందుకు ఉపయోగపడే ఏజెంట్లు పాలమీగడను శుభ్రం చేసేస్తాయి. సున్నిపిండితో ముఖాన్ని రుద్దుకోవడం వల్ల చర్మకణాలలో ఉన్న మీగడ వలన వచ్చిన తాజాదనం పోకుండా ఉంటుంది. అయితే పాల ఉత్పత్తులతో అలెర్జీ ఉంటే.. ముందుగా కొంచెం టెస్ట్ చేసిన తరువాత గానీ వాడకూడదు.