భారతదేశంలోని దేవాలయాలలో శిల్ప కళానైపుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి గుడికి ఒక విశేషం అనేది ఉంటుంది. అలానే ఇక్కడి ఈ ఆలయం ఉన్న కల్యాణ మండపం భారతదేశంలోని కల్యాణ మండపాలలో అత్యంత ఆధ్బూతం అని వర్ణిస్తుంటారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడి విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా లోని వెల్లూరు కోటలో ఉన్న చారిత్రాత్మకమైన జలకంటేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో 5 అడుగుల శివలింగం ఉంది. ఇది మహిమాన్వితమైన శివలింగంగా ప్రసిద్ధి చెందింది. జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది. ఇది విజయనగరాధీశుడు సదాశివరాయల కాలంలో కట్టబడినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. ఈకళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిషు వారు దానిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండనులో తిరిగి పునఃప్రతిష్టించాలని భావించారు. దానికి తగిన ఏర్పాట్లన్ని చేసుకున్నారు. దీని కొరకు లండను నుండి ఒక స్టీమరు కూడా బయలు దేరింది. కాని ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. ఆ సందర్భంలోనే జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా ఆ శిల్పకళా కౌశలాన్ని మనమీనాడు చూడగలుగుతున్నాము.ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇందులో అన్నీ కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలు ఉన్నాయి. ముందు భాగంలో చుట్టు ప్రహరి గోడ లేదు. ఇందులోనే మధ్యన పైకప్పుకు ఉన్న శిల్పకళను బొమ్మలో చూడ వచ్చును. రెండో భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున ఉంది. ఏ కారణం చేతనో దీని లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించ లేదు. దీని తర్వాత నున్న మూడో భాగం ఇంకొంచెం ఎత్తుగా ఉంది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది. మధ్యలో కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి ఉంది. ఇది మధ్యలో చిన్న వేదికలాగ కనబడుతుంది. స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి. ఇవి గాక నాట్య గత్తెల, సంగీత కారుల, శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి స్తంభం మీద శిల్పకళను వివరంగా గమనిస్తే, అనేక పురాణ గాధలను స్ఫురింప జేస్తాయి. ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాంటి చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను, దసరా దిబ్బ ప్రక్కన మైదానంలోను ఉన్నాయి. ఇదొక శిల్ప కళా వైచిత్రి.ఇంతటి శిల్పకళానైపుణ్యం, మంత్రముగ్దుల్ని చేసే కల్యాణ మండపం చూడటానికి ఇక్కడకి అధిక సంఖ్యలో భక్తు తరలి వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.