సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిలిపి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ వయో బేధం లేకుండా మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు. తుమ్మెదా, రామచిలుక, రాచగుమ్మడి, చెలియా, ఉయ్యాల, కోల్, వరలో, కోయిలా, సందమామ వంటి వంత పదాలను ఉపయోగిస్తూ పాడే పాటలు ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తాయి.
దీనిలో భాగంగా ముందు ఎనిమిది రోజులూ ముత్యైదువ స్త్రీలు, బాలికలు రోజు ఎంతో సంబరంగా మట్టితో బొడ్డెమ్మను పేర్చి అందరు ఒక చోట గుమిగూడి ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో విండిన చెరువులు తొణికస లాడుతూ వుంటాయి. విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు.
ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయక పోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరి పోతుందని వారి అభిప్రాయం. తొమ్మిది రోజులు బొడ్డెమ్మను ఆడిన తరువాత నీటిలో నిలుపుతారు. బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు.
ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ పడచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాప వేసి బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.
సాయంత్రం పిన్నలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు వివిధ అలంకారాలను అలంకరించుకుని బతుకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతుకమ్మలను మధ్య పెట్టుకుని బాలికలు, పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. ఆ దృశ్యాన్ని చూస్తూ గ్రామస్తులందరూ ఆనందిస్తూ వుంటారు. బతకమ్మ పాటలు ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ ,సరస్వతుల స్తోత్రాలేగాక అనేక పౌరాణిక గాథలైన శసి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు.