మన ముందు తరాల వారు చాలా పొడవుగా ఉండేవారట … రాను రాను అది తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుత కాలంలో అందరిలోనూ ఎదుగుదల చాలా తక్కువ శాతం ఉంటోంది. ఎత్తు పెరగడమనేది ఒక వయసు వరకే జరుగుతుంది. ఒక దశకు వచ్చినప్పుడు ఆగిపోతుంది. సాధారణంగా 18 – 20 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో కణాలు విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆపైన ఎత్తు పెరగరు. అలాగే ఎత్తు అనేది మన వంశపారపర్యంపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా అంతే ఎత్తు పెరుగుతారు. కానీ పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతారు.
అంత పొడవు పెరగడం ఎలా అని, కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు.. ఎత్తు పెరగడం కోసం ఎవరేది చెప్తే అది పాటిస్తుంటారు. కనిపించిన మందునల్లా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితమూ రాక అసహనంగా అయిపోతారు. అయితే కొన్ని సహజమైన పద్దతుల్లో ఎటువంటి మందులు వాడకుండా హైట్ పెరగొచ్చంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారమూ, వ్యాయామాలకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగానైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
మనిషి ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ ఎక్కువగా టీనేజ్ లో విడుదలవుతుంటాయి. అందుకే టీనేజ్ లో ఉన్నప్పుడు, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన చక్కని పెరుగుదల కనిపిస్తుంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు ప్రొటీన్లు. కోడిగుడ్లలో కాల్షియం, ప్రొటీన్లు, Vitamin-D లు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజూ తీసుకుంటే ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావలసిన మూడు ముఖ్యమైన పోషకాలైన కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి.
క్యారెట్,బచ్చలికూర, సోయాబీన్స్,బెండకాయ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్, ఫైబర్, కాల్షియం, ఉండటం వలన ఇది పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.ఉసిరికాయను రోజు క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది . ఇందులో ఉన్న విటమిన్ సి, కాల్షియం,పాస్ఫరస్, మినరల్స్ మనిషి పొడవు అవడానికి ఉపయోగపడతాయి.
ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, అశ్వగంధ 5 మిరియాలు,పొడి కలిపి 3 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజు రాత్రిపూట తాగుతుంటే మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో మెత్తగా ఉడకబెట్టిన గుమ్మడికాయ గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం కొంచెం తేనెను,పటికబెల్లం పొడిని, కలిపి రెండు స్పూన్ల చొప్పున తింటూ ఉంటే అది పొడవును పెంచే టిష్యూలు నిర్మాణం చేయడానికి,కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
పటిక బెల్లం,జీలకర్ర, ఎండిన అంజీర పండ్లు, తీసుకుని మెత్తని పొడి చేసుకుని దానిని సీసాలో జాగ్రత్త చేసుకుని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలుపుకుని తాగడం వలన ఎత్తుగా బాగా పెరుగుతారు. మాంసాహారం ద్వారా లభించే ప్రొటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇలా ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆయిల్ ను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎత్తు పెరగాలన్న ఆలోచన మైండ్ లో ధృఢంగా పాతుకుపోవాలి. వ్యాయామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో మానేయకూడదు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కిప్పింగ్ ఆడటం,వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కడం, వలన కూడా మంచి మార్పు కనిపిస్తుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అన్నది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్ కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకు చెట్టుపై ఏదైనా పండు కనిపిస్తే.. దానిని అందుకోవడానికి ఎగురుతుంటాం. అలా ఎక్కువ హైట్ లో ఉండే.. ఒక ఇనుప రాడ్ ను ఏర్పాటు చేసుకొని.. దానిని ఎగురుతూ పట్టుకోవాలి. ఇలా స్కిప్పింగ్ మరియు ఎగరడం అనేది ఎత్తు పెంచడంలో సహకరిస్తాయి.