శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోమనాథ జ్యోతిర్లింగం:
గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ ఆలయం ఉంది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాధ్ క్షేత్రం మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. ఈ ఆలయం 7 వ శతాబ్దంలో సీనా రాజవంశంచే నిర్మిచబడినది. ఈ ఆలయం అనేక సార్లు మొహమ్మదీయుల చే నాశనం చేయబడింది. చంద్రుడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణం. అందుకే ఆ స్వామికి సోమనాథేశ్వరుడు అనే పేరు వచ్చినది.
మల్లికార్జున జ్యోతిర్లింగం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో దట్టమైన అరణ్యంలో సముద్రమట్టానికి 458 కి.మీ. ఎత్తైన కొండపైన అతిపురాతన శివాలయం ఉంది. ఇక్కడ శివుడు మల్లికార్జునిడిగా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడి కేవలం శిఖరాన్ని దర్శిస్తే చాలు పునర్జన్మ లేకుండా చేయగల శివశక్తి ప్రదేశమే శ్రీశైలం.
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంని ఉజ్జయిని నగరంలో మహా కాళేశ్వరాలయం ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ మహాకాళేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఇక్కడి శివలింగాన్ని అందరు స్మృశించి పూజించే అవకాశం ఉంది. ఇక్కడి సిప్రానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కొండ ప్రదేశంలో ఓంకారేశ్వర శివలింగ క్షేత్రం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఇక్కడ ఉన్న నర్మదానది మాత్రం పడమరకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. జ్యోతిర్లింగ మధ్యన చిన్న చీలిక ఉంది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలసి నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెబుతుంది.
కేదార్నాథ్ జ్యోతిర్లింగం:
కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. చార్ ధామ్ అనబడే నాలుగు క్షేత్రాలలో కేదార్ నాథ్ ఒకటి. కేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది.
భీమశంకరా జ్యోతిర్లింగం:
మహారాష్ట్ర, పూణే జిల్లాలో భీమశంకర్ ఆలయం ఉంది. ఇది భీమనది జన్మ స్థలం అని చెబుతారు. ఒక గుంటలాంటి ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. గర్భాలయం లోపల స్వామికి ఐదు తలలు ఉన్నట్లు తెలుస్తుంది.
విశ్వనాథ్ జ్యోతిర్లింగం:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి జిల్లాలో కాశి విశ్వేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు కాశి విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్మకం.
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం:
మహారాష్ట్ర, నాసిక్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరం ఉంది. ఈ ఆలయం వెనుక ఒక కొండ వరుస కనిపిస్తుంది. అందులో ఎదురుగా కనిపించే కొండని బ్రహ్మగిరి అంటారు. ఈ కొండమీదనే గోదావరి జన్మస్థలం. గర్భాలయానికి ఎదురుగా ఒక పెద్ద రాతి నంది ఉంది. ఇక్కడ స్వామివారు ఐదు శిరస్సులతో, 15 కన్నులతో భక్తులకి దర్శనం ఇస్తుంటాడు.
వైద్యనాథ జ్యోతిర్లింగం:
జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీ వైద్యనాదేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడిని వైద్యనాధుడిగా కొలుస్తుంటారు. ఈ స్వామిని పూజిస్తే వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం.
నాగేశ్వర్ జ్యోతిర్లింగం:
గుజరాత్ రాష్ట్రంలో, ద్వారకా నగరానికి గోమతి మధ్యలో ద్వారకకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తులకి దర్శనం ఇస్తుంది. అయితే శివుని ప్రసన్నం చేసుకోవడానికి కృష్ణుడు ఇక్కడ రుద్రాభిషేకం చేసేవాడని భక్తుల నమ్మకం. ఇంకా ఈ ఆలయంలో నంది తూర్పు ముఖంగా చూస్తుండగా, శివుడు దక్షిణముఖంగా ఉంటాడు. ఆలయంలోనే పార్వతీదేవి నాగేశ్వరిగా, గంగాదేవి గంగా మాతగా కొలువై ఉన్నారు. వారి దర్శనం సకల పుణ్యప్రదం.
రామేశ్వర జ్యోతిర్లింగం:
తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ రాముడు సేతువుని ఇక్కడే నిర్మించాడని తెలుస్తుంది. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు పుణ్యక్షేత్రం. రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. ఆలయం బయట నుంచి కొంతదూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గ్రామం ఉంది. ఈ గ్రామానికి, గుహలు ఉన్నవైపుగాకా, రెండవ వైపున శ్రీ ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. ఈ ఘృష్ణేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. ఈ ఆలయం అందముగా, ఆకర్షణీయంగా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. దీని నిర్మాణ శైలి కూడా మిగతా ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయములో ఉన్న శివలింగాన్ని విష్ణుమూర్తి ప్రతిష్టించాడు. ఈ లింగమును పూజుంచిన వారికీ పుత్రశోకం కలుగదు అని ఇక్కడి భక్తుల నమ్మకం