కషాయం అనగానే వినిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు ఎలాంటి వ్యాధులు మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది? వీటిని ఎందుకు ఔషధాలుగా వాడుతున్నాం… అది తెలుసుకోవాలంటే మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాల్సిందే…
సుగంధద్రవ్యాలలో ఒకటైన లవంగాలను దేవకుసుమా అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతారు. లవంగాల నుండి విటమిన్ సి లభిస్తుంది. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు విటమిన్ K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C మరియు K రోగనిరోధకతను పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతాయి. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది.
ఇంకా లవంగాలు దంతసమస్యలకు అద్భుత పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. నొప్పులు, వాపులకు లవంగాలు చక్కని నివారణ.రక్త ప్రసరణ మెరుగు పడేందుకు లవంగాలను ఉపయోగిస్తారు. జీర్ణాశయ సమస్యలకు లవంగాలు చక్కని పరిష్కారం. క్యాన్సర్ నివారణకు,
తలనొప్పులకు,
- ఒత్తిడి తగ్గించడానికి,
- టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి
- చెవి నొప్పికి
- మొటిమల సమస్యలకు
- వికారం వాంతులకు పరిష్కారంగా ఇలా ఎన్నో సమస్యలకు లవంగాలను ఔషధంగా ఉపయోగించవచ్చు.
క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. మిరియాలతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయమవుతాయి.ఇవి ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి. గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమాన్ని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. ఇది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరం చెస్తుంది.
మిరియాలు నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి పంపి రక్తప్రసరణ వేగవంతమయేలా చేస్తుంది. కొవ్వు ఎక్కువుగా పేరుకోకుండా చేసి, మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.