Home Health ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలో తెలుసా ?

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలో తెలుసా ?

0

సాధారణంగా కాలుష్యం, ధూమపానం వంటివి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ కరోనా వైరస్ సోకితే ముందుగా ప్ర‌భావిత‌మ‌య్యేవి ఊపిరితిత్తులే. వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ ఊపిరితిత్తులకు చేరుతుంది. కాబ‌ట్టి ముందుగా వాటిపైనే ప్ర‌భావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డి శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

diagnose a lung infectionఒకసారి ఊపిరితిత్తులు కరోనా బారిన పడితే కోలుకున్న‌ప్ప‌టికీ ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు చాలా రోజుల వ‌ర‌కు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే వైర‌స్ పూర్తిగా త‌గ్గిపోయినా.. దాని ప్ర‌భావం వ‌ల్ల ఊపిరితిత్తులు య‌థాస్థితికి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఆస్తమా, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక రోగుల్లో సమస్య మరింత తీవ్రం అవుతున్నది. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే వైరస్‌ ముప్పు కాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ్వాస వ్యవస్థలోకి వైరస్‌ ప్రవేశించిన వెంటనే మన రోగ నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. దీంతో గొంతులో మంట, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వీటిని ముందుగానే గుర్తించగలిగితే వైరస్‌ ఊపిరితిత్తులను దెబ్బతీయకముందే కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

మరి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి? శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే..ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి. కరోనా కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌త ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే ఊపిరితిత్తులను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

వ్యాయామం వలన శ్వాస తీసుకునే రేటు పెరిగి ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు శుభ్రం అవుతాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. ముక్కుతో శ్వాస తీసుకుని నోటితో వదలడం ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవ‌డంలో చ‌క్క‌టి వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బ‌లంగా శ్వాస తీసుకోవాలి. ఆ త‌ర్వాత పీల్చిన గాలిని నెమ్మ‌దిగా నోటి ద్వారా వ‌ద‌లాలి. ఇలా ఒక రోజులో క‌నీసం 6 నుంచి 7 సార్లు చేయాలి. ఈ వ్యాయామం వలన ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరిగి బ‌లంగా త‌యార‌వుతాయి. బెలూన్ ఊద‌డం కూడా ఊపిరితిత్తులు తొంద‌ర‌గా కోలుకోవ‌డానికి ఎక్కువ‌గా సూచించే సులభమైన ప‌ద్ధ‌తి. బెలూన్ల‌లో గాలి నింప‌డానికి బ‌లంగా ఊదాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల ఊపిరితిత్తులు బ‌లంగా త‌యార‌వుతాయి.

యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛ‌రిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవ‌డంలో ఇది పురాత‌నం నుంచి వ‌స్తున్న ఓ చ‌క్క‌టి ప‌ద్ధ‌తి. పొట్ట నుంచి ఓం శ‌బ్దం ఉచ్చ‌రిస్తూ గ‌ట్టిగా శ్వాస తీసుకుని వ‌ద‌ల‌డం ద్వారా ఊపిరితిత్తులు బ‌లంగా త‌యార‌వుతాయి. అయితే ఓంకారం శ‌బ్దం చేసేట‌ప్పుడు దీర్ఘం తీసిన‌ట్టుగా అంటూ శ్వాస తీసుకుని వ‌దిలితేనే మంచి ఫ‌లితం ఉంటుంది.

వీటితో పాటు లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఇందులో ఇంకా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి మంచి రెస్పిరేటరీ సిస్టమ్ ని మెయింటెయిన్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. బ్రకోలీ, కాలే, కాలీ ఫ్లవర్, క్యాబేజ్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి కూరగాయల్ని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. వీటిలో ఉండే లిగ్నన్స్ లంగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి.

 

Exit mobile version