ఎవరికైనా వివాహ సంబంధం చూస్తున్నారంటే మన పెద్ద వారు గోత్రం ఏమిటి అని అడుగుతారు. ఇద్దరి జీవితాలు ముడి పడడానికి గోత్రం అనేది ఎంత ముఖ్యం అనేది అర్ధమవుతుంది. అలాగే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళి పూజలలో పాల్గొన్నప్పుడు, పంతులుగారు మనకు అర్చన చేయటానికి ముందుగా మన ఇంటి పేరు గోత్రనామాలను అడిగి కుటుంబ సభ్యుల పేర్ల పై అర్చన చేయడం మనం చూస్తూ ఉంటాం.
అసలు ఈ గోత్రం అంటే ఏమిటి? ఈ గోత్రనామాలు ఎలా నిర్ణయించబడి ఉంటాయి? అనే విషయాలు మాత్రం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే పూర్వం మనకు ఈ గోత్రనామాలను ఎలా నిర్ణయించే వారో ఇప్పుడు తెలుసుకుందాం….
సాధారణంగా గోత్రం అనగా మూల పురుషుడు అని అర్థం. ఒక మనిషి భూమిపై జీవించడానికి ఒక రూపాన్ని అందించేది స్త్రీ అయినా, ఆ స్త్రీ గర్భంలో మనిషి జీవం పోసుకోవడానికి గల కారణం మాత్రం పురుషుడు.
కాబట్టి వారి గోత్రం మూల పురుషుడు పై ఆధారపడి ఉంటుంది. గోత్రం అనగా గోవు, గురువు, భూమి ,వేదం అనే అర్థాలు వస్తాయి. పూర్వకాలం ఆటవిక జీవితమును గడిపిన మానవుడు గోవులను వాటి రంగుల ఆధారంగా వారి తాతల, ముత్తాతల గోత్రనామాలను నిర్ణయించుకునే వారు.
అంతేకాకుండా పూర్వం ఏ గురువు వద్ద అయితే విద్యాభ్యాసం నేర్చుకొని ఉంటారో, ఆ గురువు వశిష్ట, వాల్మీకి, భరద్వాజ అనే గురువు పేర్లను కూడా గోత్రనామాలుగా పెట్టుకునేవారు. ఆ తర్వాత మరికొంతమంది భూములను కలిగిన బోయ, క్షత్రియులు, భూపని, భూపతి అనే గోత్రాలను కూడా ఏర్పరచుకొన్నారు. అలాగే బ్రాహ్మణులు సైతం వారు నేర్చుకున్న వేదాలని గోత్రాలుగా నిర్ణయించుకున్నారు.
మొదట ఈ గోత్రనామాలను కేవలం వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులకు మాత్రమే ఉండేవి. ఒక పురుషుడి వల్ల జన్మించిన ఆ శిశువుకు ఆ తండ్రి గోత్రములనే పిల్లల గోత్రాలుగా నిర్ణయిస్తారు.
అయితే వివాహ సమయంలో వధువు, వరుడు గోత్ర నామాలు ఒకే విధంగా ఉండకుండా వేరు వేరు గోత్రాలకు చెందిన వారికి వివాహాలు జరపడం మంచిదని, అలాంటప్పుడు ఈ గోత్ర నామాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.