మన దేశంలో ఎంతో పురాతనమైన అద్భుత ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాల శిల్పకళా నైపుణ్యం, ఆ ఆలయ స్థల పురాణం, ఆలయంలోని ఉన్న ఎన్నో అర్ధం కానీ రహస్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇది ఇలా ఉంటె కొన్ని దేవాలయాలు తాంత్రిక శక్తిని పొందే ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఆ తాంత్రిక దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు వాటిని తాంత్రిక దేవాలయాలు అంటారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైతల్ ఆలయం:
ఒడిశా రాష్ట్రంలో, భువనేశ్వర్ లో వైతల్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో చాముండి దేవి కొలువై ఉంది. ఈ అమ్మవారిని కాళీమాత ప్రతి రూపంగా భక్తులు భావిస్తారు. చాముండి దేవి పుర్రెల దండ ధరించి దర్శనం ఇస్తుంటుంది. ఇది ఒక శక్తివంతమైన తాంత్రిక దేవాలయం అని చెబుతారు.
కాళికాదేవి ఆలయం:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో కాళీఘాట్ లో శ్రీ కాళికాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి కారణంగా ఈ నగరానికి కలకత్తా అనే పేరు వచ్చినది. ఈ ఆలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం అనేది ఉండదు. సుమారుగా మూడు అడుగుల ఉన్న తలా భాగం మాత్రమే ప్రతిష్టించబడి ఉంటుంది. దేశంలో ఉన్న శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు.
జ్వాలాముఖి దేవాలయం:
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా నుండి దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే ఊరిలో ఈ జ్వాలాముఖి ఆలయం ఉంది. మెయిన్ రోడ్డులో ఒక చిన్న కొండమీద ఈ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం కలదు. అయితే 51 శక్తిపీఠాలలో ఈ జ్వాలాముఖి ఒకటి. అయితే సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. అమ్మవారు జ్వాలారూపంలో ఉండటం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ ఆలయంలో రెండు నుంచి 10 ఏళ్లలోపు కన్యాలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు. ఈవిధంగా కన్యలను పూజించడం వలన దారిద్య్రం తొలుగుతుందని, దుఃఖ, శత్రునాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఏక లింగజి ఆలయం
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఏకలింగజి ఆలయం ఉంది. ఇది గొప్ప శైవక్షేత్రం. ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివమూర్తి విగ్రహం దర్శనం ఇస్తుంది. గర్భాలయానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలున్నాయి. మధ్యలో నల్లని శిలతో మలచిన శివలింగం కనిపిస్తుంది. ఇది కేవలం లింగాకారంలో కాకా నాలుగు పక్కల నాలుగు ముఖాలున్నాయి. ఈ నాలుగు ముఖాలు బ్రహ్మ, విష్ణు, ,మహేశ్వర, సూర్య అనే నాలుగు పేర్లతో పిలువబడుతున్నాయి.
కాలభైరవ ఆలయం:
మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఉజ్జయిని నగరంలో కాలభైరవుని ఆలయం ఉంది. అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ కాలభైరవుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్వామి మద్యపాన ప్రియుడు. ఈ ఆలయ చుట్టూ పక్కల స్వామివారి కోసమే దుకాణాల్లో మద్యం అమ్ముతుంటారు. అయితే సీసాలో ఉండే మద్యం స్వామి నోటి దగగ్ర ఉంచితే శబ్దం చేస్తూ సీసా కాలి అవ్వడం మనం ప్రత్యేక్షంగా చూడవచ్చు. ఇది ఎంత వరకు వాస్తవం అనేది ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.
ఇలా ఇవే కాకుండా, కామాఖ్యాదేవి ఆలయం, వైద్యనాథ్ ఆలయం వంటి మరికొన్ని దేవాలయాలు తాంత్రిక దేవాలయాలుగా, అఘోరాలు వచ్చి పూజలు చేసే దేవాలయాలుగా, తాంత్రిక శక్తి దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి.