ఐరన్ లోపం చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. మహిళలు ఐరన్ లోపంతో ఎక్కువగా బాధపడతారు. ఐరన్ శరీర భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. అలసటను నివారించడానికి సహాయపడుతుంది. ఇది శ్వాస సమస్యలు, బలహీనత, తలనొప్పి, మైకం, ఆకలి లేకపోవడం వంటి మరెన్నో సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ లోపాన్ని నివారించడానికి కొన్ని పండ్లు, కూరగాయలు సహాయపడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. మరి ఐరన్ లభించే సీజనల్ పండ్లు, కూరగాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్యాబేజీ ద్వారా ఐరన్, ఇతర ఖనిజాలు శరీరానికి అందుతాయి. ఐరన్ లోపాన్ని నివారించడంతో పాటు బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచడానికి, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడానికి క్యాబేజీ సహాయపడుతుంది.
పాలకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని ఆకుకూరల్లో రారాజుగా పిలుస్తారు. పాలకూరను ఐరన్, వివిధ విటమిన్లు, ఖనిజాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ రోగనిరోధక శక్తిని, హిమోగ్లోబిన్ స్థాయులను పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి.
బీట్‌రూట్ ఐరన్‌కు ప్రధాన వనరు. దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవాలి. ఇది శీతాకాలంలో విరివిగా లభిస్తుంది. ఐరన్, కాపర్, ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్ వంటి పోషకాలు బీట్‌రూట్ ద్వారా అందుతాయి. దీని నుంచి విటమిన్ సి కూడా శరీరానికి అందుతుంది. శరీరం ఐరన్‌ను సంగ్రహించే శక్తిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది.
నారింజలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలో ఐరన్ స్థాయిని పెంచడానికి ఇవి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు నారింజను క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పండు దోహదం చేస్తుంది.
యాపిల్ పండులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇవి శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే ఐరన్ లోపం సహా ఇతర అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.
బ్రకోలీని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీంట్లో వివిధ రకాల బి విటమిన్లు, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి దానిమ్మ తోడ్పడుతుంది. ఐరన్, విటమిన్లు, ప్రోటీన్, పిండి పదార్థాలు, ఫైబర్ వంటి పోషకాలకు దానిమ్మ మంచి వనరుగా ఉంటుంది. దానిమ్మలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.