పురాతన కాలం నుండే తాంబూలానికి హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తమలపాకు, సున్నం, వక్క, కాచు, ఏలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం. దీన్ని మనం వాడుక భాషలో కిళ్ళీ అని, పాన్ అని, బీడా అనీ కూడా పిలుచుకుంటాము.
పూజా సమయంలోనూ తమలపాకులకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానిదే అగ్రస్థానం. కొందరు దేవుళ్ళకి తమలపాకులతోనే పూజలు చేస్తారు. ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, తమలపాకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, పోలిక్ యాసిడ్ మరియు క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. తమలపాకుతో పాటుగా సున్నం కలిపి వేసుకుంటే, శరీరంలో క్యాల్షియమ్ సమపాళ్లలో ఉండేలా చేస్తుంది.
క్యాల్షియం పుష్కలంగా తమపాకులలో ఉంటాయి. అందువల్ల, ఎముకలు అరగకుండా ఉండటంలో తమలపాకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. బాలింతలు తాంబూలం వేసుకోవటం చాలా మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం కలిపి తీసుకున్నట్లైతే శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది. తమలపాకులలో పీచు పదార్ధం ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆకులు జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తాయి.
చిన్న పిల్లలకు జలుబు చేసినపుడు తమలపాకు రసం రెండు చుక్కలు పాలలో కలిపి ఇచ్చినట్లైతే వారికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు దూరమైతాయి. అనేకరకాలైన విష తుల్యాలను హరించగల అద్భుతమైన ఔషదగుణాలు ఈ తమలపాకులలో ఉన్నాయి. ప్రదానంగా రోగ నిరోధక శక్తి పెంచే అద్భుత శక్తి తాంబూలానికి ఉంది.