ఈ రోజుల్లో ఏమి తినాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే , తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టి సరైన ఆహారం తీసుకోవడం మరో ఎత్తు. మన ఆహారంలో అధిక భాగం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. చికెన్, గుడ్లు, ఓట్స్, శెనగలు, పన్నీరు వంటి ఆహార పదార్ధాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్ ను భాగంగా చేసుకుంటూనే అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు తినాలి. ప్రతీ రోజూ ఒక పండును, పచ్చి కూరగాయల సలాడ్ లను ఆహారంలో భాగంగా చేసుకుంటే పీచు పదార్ధం సులువుగా దొరుకుతుంది.
అలాంటివాటిలో కూరగాయలలో టమాటాలు ఒకటి. మన రోజువారి వంటలలో టమాటాలకు అధిక ప్రాధాన్యత ఉంది. చూడటానికి ఎరుపురంగును కలిగి పుల్లటి రుచితో ఉండే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు టమాటాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు.
టమాటల్లో శరీరానికి మేలు చేసే పోషకాలు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ విలువలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లైకోపిన్, విటమిన్ సి, పోటాషియం, ఫొలేట్, విటమిన్ కె ఉండే టమాటను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.
టమోటాలలో అధిక భాగం విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ సమృద్ధిగా ఉండి, సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సమస్యలు లేకుండా కాపాడుతుంది. టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
తాజా అధ్యయనాల ప్రకారం టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కాన్సర్ సెల్ లైన్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటి వల్ల గ్యాస్ట్రిక్ కాన్సర్ తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు. టమోటాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణాలను నశింప చేయడమే కాకుండా ప్రోస్ట్రేట్, సర్వికల్, నోరు, గొంతు ఇలా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాలు ఇది తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి.
టమాటాలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు, వాటిల్లో ఉండే సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నందున రక్తపోటు స్థాయిల నియంత్రణలో అవి జోక్యం చేసుకోలేవు. నిజానికి, ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలా అని టమోటాల వినియోగాన్ని ఇతర మార్గాలలో ఎక్కువగా వినియోగించినట్లయితే, అందులో ఉండే సోడియం స్థాయిలో పెరగటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మరింత హానిని తలపెడతాయి.
ముఖ్యంగా బోవెల్ సిండ్రోమ్ తో ఎక్కువగా బాధపడుతున్న వారికి ఈ టమాటాల్లో అధిక వినియోగం కారణంగా ఈ పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది, అలాగే కడుపు ఉబ్బరానికి కూడా దారితీస్తాయి. అలాగే ఎవరైతే సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారందరూ పొటాషియం తీసుకోవడాన్ని పరిమితం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పొటాషియం అనేది ముఖ్యంగా టమోటాలలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగించవచ్చు.
అలాగే కొంతమంది టమాటా సాస్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే సాస్ లో కేవలం టమాటా కాకుండా ఉప్పు, పంచదార, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఫుడ్ కలర్ లాంటి అనేక పదార్థాలను కలుపుతారు. వీటి ద్వారా మధుమేహం,రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. టమాటా సాస్ ను తయ్యారు చేసే కొన్ని సంస్థలు ఇందులొ చీప్ క్వాలిటీ పదార్థాలు వాడుతారు. ముఖ్యంగా సాస్ లో గుజ్జు రావడానికి టమాటాకి బదులుగా పుచ్చకాయ, బొప్పాయి లాంటి పండ్ల నుండి తీసిన పిప్పిని వాడుతారు.
సాస్ తయ్యారు చేసే సమయంలో నాణ్యత మరియు పరిశుభ్రత పాటించరు. ఇది ఖచ్చితంగా అనేక వ్యాధులకు గురి చేస్తుంది. సాస్ లో వాడే ఫుడ్ కలర్ ద్వారా ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాస్ లో ప్రథమంగా వాడేది హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్. దీనిలో ఎన్నో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఎంత నాణ్యమైన సాస్ అయినా… అందులో ఇది కలపడం మాత్రం తప్పనిసరి. ఒక టేబుల్ స్పూన్ సాస్ ద్వారా 30 కేలరీలు వస్తాయి. టమాటా లో ఉండే విటమిన్-A, విటమిన్-C మరియు ఫైబర్ లాంటి ముఖ్య పోషక గుణాలు.. సాస్ గా చేసేటప్పుడు కోల్పోతాయి.
సాస్ ని తీవ్ర ఉష్టోగ్రత తో తయ్యారు చేస్తారు కాబట్టి టమాటా లోని పోషకాలు అన్నీ నశించిపోతాయి. ఊబకాయం తో భాధపడుతున్నవారు, ఎలర్జీ, ఆస్తమా లాంటివి ఉన్నవారు టమాటా సాస్ నుండి దూరంగా ఉండడం మంచిది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు సాస్ జోలికి వెళ్లకపోవడం మరీ మంచిది. టమాటా సాస్ కి బదులుగా ఇంట్లో చేసుకునే పుదినా, కొత్తిమీర, కరివేపాకు లాంటి చట్నీలు ఎంతో మంచివి. వీటిని రోజు తిన్నా పరవాలేదు.