హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో పండగకి ఒక్కో విశిష్టత ఉంది. పండుగలు వస్తే చాలు ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజ గదిని ప్రత్యేకించి అలంకరించి…వివిధ రకాల నైవేద్యాలతో ఎంతో గొప్పగా పూజలు జరుపుతుంటారు. హిందువులు ప్రతి ముఖ్యమైన పూజ సమయంలో ఆ దేవుళ్ళకు కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. మన సంప్రదాయాలలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పూజ అయిన అనంతరం కొబ్బరికాయను పగలకొట్టి ఆ దేవుని ముందు ఉంచుతాము. ఇలా కొబ్బరికాయను కొట్టి దేవునికి సంమర్పించడాన్ని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
అలాగే మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుంది. నోములు,వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. వినాయకచవితి, శ్రావణ శుక్రవారం పూజలు చేసుకున్నప్పుడు కచ్చితంగా కలశం పెట్టుకుంటాం. కలశాన్ని వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.
అసలు కలశంపై కేవలం కొబ్బరికాయను పెట్టడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంట్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కలశం పెట్టడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే కలశంపై కొబ్బరి కాయను పెట్టడానికి గల కారణం.. ఈ విశ్వం మొత్తానికి కొబ్బరికాయ మరో రూపంగా భావిస్తారు. ‘‘కలశస్య ముఖే విష్ణుః..’’ ఇత్యాది మంత్రాలు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. కలశంపై అమర్చే కొబ్బరికాయ కూడా బ్రహ్మాండానికి సంకేతం. కొబ్బరికాయ పూర్ణఫలం. అదే కాయ, అదే విత్తనం కూడా… మనం అర్చించే దైవం సృష్టిలో అంతటా నిండి ఉన్నాడని, అంతటా ఉన్న పరమాత్మకు ప్రతీకగా ఏదో ప్రతిమను మనం ఏర్పాటు చేసుకున్నామని కొబ్బరికాయ అమర్చిన కలశం తెలియచేస్తోంది. కొబ్బరికాయ ఆ దేవుళ్ళ అంశం కలిగి ఉంటుందని భావించడం వల్ల శుభకార్యాలు, పూజా సమయాలలో సకల దేవతలను ఆహ్వానించినట్టు కలశంపై కొబ్బరికాయలు ప్రతిష్టిస్తారు.
అయితే మనలో చాలా మందికి ఆ కొబ్బరికాయ ఏమి చేయాలా అనే సందేహం ఉంటుంది. ఇప్పుడు కలశం ఎలా పెట్టుకోవాలి ఆ కొబ్బరి కాయ ని ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కలశం కోసం రాగిచెంబు లేదా వెండి చెంబును తీసుకోని దానికి పసుపు,కుంకుమ రాయాలి. కలశంలో కొంచెం నీటిని పోసి, అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయ చుట్టూ ఒక వస్త్రాన్ని చుడతారు. ఇక పూజ అయ్యిపోయాక కలశంలో కొబ్బరికాయను ఏమి చేయాలా అనే సందేహం రావటం సహజమే.
కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని.. అది ఒక వేళ కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు. కనుక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషము ఉండదని పండితులు అంటున్నారు. ఈ విధంగా కలశంపై ప్రతిష్టించిన కొబ్బరికాయను పూజ అనంతరం బ్రాహ్మణుడికి ఇచ్చి పాదాభివందనం చేయడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయి. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను ‘పూర్ణాహుతి’కి వాడుతుంటారు. ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది.
సాధారణంగా ఇంట్లో దేవుడికి కొట్టే కొబ్బరి కాయనైతే పచ్చడి చేసుకుని తింటాం. లేదా పాయసం చేసుకుని తింటాం. కలిశం పై కొబ్బరికాయను కుటుంబ సభ్యులు తినవచ్చు. కానీ,పచ్చడిగా కాదు. ఇందులో ఉప్పు కారం వేయకూడదు. తీపి కలిపి ప్రసాదంగా తయారు చేసి కనీసం ఒకరికైనా ఇతరులకు పంచిన తరువాత తింటే అది ప్రసాదం అవుతుంది. కనుక కలశంపై ఉంచిన ప్రసాదంలా పదిమందికి పంచాలి.