విష్ణుమూర్తి దశావతారాలలో శ్రీకృష్ణుడి అవతారం సంపూర్ణ విష్ణు అవతారంగా ప్రసిద్దినొందిన అవతారం. ఆయన లీలలు అనంతం. అయితే ఆయన్ను బాలకృష్ణుడి దగ్గర నుంచి జగత్ గురువుగా పిలుస్తారు. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కున్న ఆనందంగా ఉండాలని సూచించే విధంగా జీవించారు. చెరసాలలో జన్మించి యశోదమ్మ తనయుడిగా రేపల్లెలో ఎంతో అల్లరి చేసాడు. ధర్మం పక్కన నిలబడి ధర్మం కోసం కురుక్షేత్ర యుద్ధమే జరిపించాడు.
గోవు అంటే ఆవు. ఆలమందలతో నిరంతరం కొలాహలంగా ఉన్న నందగోకులంలో పెరిగిన శ్రీకృష్ణుని పేరు గోవిందుడు అని భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ద్వాపరయుగంలో గోవింద నామంతో విష్ణువు సుప్రసిద్దుడయ్యాడు. ఈ కృష్ణునికి గోవిందుడు అనే నామం రావడానికి గల కారణాన్ని మన పురాణాలు ఇలా చెబుతున్నాయి.
గోకులంలో ఉండే ప్రజలందరికీ, గోవులకు కావలసిన ఆహారమంతా పక్కన ఉన్న గోవర్ధన గిరి నుండి లభించేది. గోవర్ధన గిరి మీద ఆధారపడి జీవిస్తున్నా ఈరోజు దానిని పూజించాలని ఆలోచన ఎవరికీ రాలేదు. కానీ ప్రతియేటా వర్షాలు పడేందుకు ఇంద్రుడికి యజ్ఞ యాగాలు పూజలు జరిపించేవారు. దానితో ఇంద్రుడికి ఎక్కడ లేని గర్వం వచ్చింది. ప్రతి ఏడాది లాగే ఆ సంవత్సరం కూడా గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు.
ఆ సమయంలో బృందావనానికి రాజు నంద మహారాజు. ప్రజలందరితో పాటు బృందావనంలో నందమహారాజు ఇంద్రయాగం చేయాలనుకున్నాడు. కానీ ఆ యాగాన్ని ఏడేండ్ల బాలుడైన చిన్ని కృష్ణుడు వద్దన్నాడు. గోవులు, బ్రాహ్మణులు, గోవర్దన పర్వతం ప్రీతి చెందేలా యాగం చేయమన్నాడు.
చిన్ని కృష్ణుడి మాటల్లో నిజముందని గమనించిన బృందావనం ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజించారు. ఐతే ఆ యాగం వల్ల ఇంద్రునికి కోపం వచ్చి పెద్ద గాలి వానను కురిపించాడు. అప్పుడు కృష్ణుడు గోవులను రక్షించాడు. అందుకు సురభి అనే గోవు దేవతలు, మహర్షుల సమక్షంలో చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేసి గోవిందుడు అనే నామాన్ని ఇచ్చింది.
ఈ విధంగా గోగణ రక్షణం చేసి దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందుడిగా ప్రసిద్ది చెందాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవిందుడుగా ఉన్నాడు. కాబట్టే కలియుగంలో కూడా ఆ గోవింద నామాలనే భక్తుల చేత పలికిస్తూ పరవశం చెందుతున్నాడు.