పంచ ప్రయాగ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం. కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే అయిదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అని విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ లోని పంచ ప్రయాగ హిందువులకు అత్యంత పవిత్ర ప్రదేశం. ఈ నీటిలో మునగడం ద్వారా మనిషి యొక్క బుద్ధి, శరీరం, ఆత్మ శుద్ధి చేయబడి మోక్షానికి చేరువవుతారని విశ్వసిస్తారు.

దేవ ప్రయాగ:

పంచ ప్రయాగరుషికేశ్ నుంచి 70కి.మీ దూరంలో ఉంది దేవప్రయాగ. ఇది కుబేరుని పట్టణమైన అలకాపురి నుండి వచ్చే అలకనంద మరియు గంగోత్రినుండి వచ్చే భాగీరథీ నదుల సంగమం. ఈ పట్టణానికి ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు. 108 దివ్యతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కేదారీనాథ్‌లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో పుచ్చిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి. త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రౌద్ధకర్మలకు ప్రసిద్ధి చెందినది. బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంధపురాణం వివరిస్తుంది. ఇక్కడ రఘునాథ్ మందిరముంది. ఈ ఆలయాన్ని విధిగా దర్శించాలి. శ్రీరాముడు ఇక్కడ అశ్వమేధయాగం చేసిన ప్రదేశంగా పురాణాల కథనం

నందప్రయాగ:

పంచ ప్రయాగరిషీకేశ్ నుండి 190 కి.మీ.దూరంలో ఉంది నందప్రయాగ. అలకనంద , నందాకినీ నదుల సంగమం. ఇక్కడకు కొంత దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉంది. ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య, ఒక మంచులోయ ఉంది. ఆ లోయలో నుండి, నందాకిని అనే చిన్ననది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి, అలకనంద నదిలో కలుస్తుంది. నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలవబడుతుంది. ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది. పురాణల ప్రకారం ఇక్కడ నంద అనే రాజు దేవతలను సంతోషింపజేయడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి యజ్ఞం నిర్వహించాడని చెబుతారు. మరో ప్రసిద్ధ పురాణ కధనం ప్రకారం శ్రీకృష్ణుడు పెంపుడు తండ్రి నంద పేరుమీద ఈ సంగమ స్థలానికి ఆ పేరు వచ్చినట్లు నమ్ముతారు. దుష్యంతుడు, శకుంతలను వివాహం చేసుకున్న స్థలంమని స్థానికుల కథనం

కర్ణప్రయాగ:

పంచ ప్రయాగరిషీకేశ్ నుండి 169 కి. మీ దూరంలో ఉంది కర్ణప్రయాగ. ఈ ప్రాంతం అలకనంద మరియు పిండారీ నదుల సంగమం. నంద ప్రయాగ తర్వాత అలకనంద నది యొక్క దిశ కొంత నైఋతి దిక్కుగా మారుతుంది. నంద ప్రయాగ తర్వాత సుమారు 22 కి.మీ., దూరంలో, అంటే బదరీనాథ్ నుండి 128 కి.మీ., దూరంలో కర్ణ ప్రయాగ ఉన్నది. ఇక్కడ నుండి తూర్పుగా సుమారు 100 కి.మీ, దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి ‘పిడరగంగ’ అనే నది ప్రవహిస్తూ వచ్చి, ఆ అలకనంద నదిలో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు తపమాచరించి శంకరుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణ ప్రయాగ ఇనే పేరు వచ్చింది అంటారు. స్వామివివేకానంద ఇక్కడ 18రోజులు తపమాచరించాడు. ఇక్కడ ఉమాదేవి ఆలయం ప్రసిద్ధి.

రుద్ర ప్రయాగ:

పంచ ప్రయాగరిషీకేశ్ నుండి 140 కి. మీ దూరంలో ఉంది రుద్రప్రయాగ. కర్ణ ప్రయాగ నుండి సుమారు 31 కి.మీ., నైఋతి దిశగా, అంటే బదరీనాథ్ నుండి 159 కి.మీ., దూరంలో రుద్ర ప్రయాగ ఉంది. ఇక్కడ మందాకినీ, అలకనందా నదులసంగమం చూడవచ్చు. హరిద్వార్ – ఋషికేష్ ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి, ఒక మార్గం కేదార్ నాథ్ వైపుకు, మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి. కేదార్ నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది, దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది. రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చేప్పాలి. కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది. ఇక్కడ రుద్రనాథమందిరం, చాముండాదేవి ఆలయం ఉన్నాయి. శంకరుడు నారదునకు సంగీతం నేర్పిన ప్రదేశమిది. శంకరుడు వీణానాదాన్ని(రుద్రవీణ) ఆలపించిన చోటుగా ప్రసిద్ధి. ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి జగదాంబ దేవి అనే అమ్మవారి ఆలయమూ, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి. ఈ స్వామిపేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసుద్ధి చెందింది.

విష్ణుప్రయాగ:

పంచ ప్రయాగరిషీకేశ్ నుండి 256 కి.మీ.దూరంలో విష్ణుప్రయాగ ఉంది. అలకనంద , ధౌళిగంగ ల సంగమమిది. విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో ‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది. ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది. విష్ణుమూర్తి వీర నారాయణ రూపం ధరించి, తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ, ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి, తపస్సు చేశాడట. అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. అందులోని దైవం శ్రీ మహావిష్ణువు. పర్వతారోహణకు కూడా విష్ణుప్రయాగ ప్రసిద్ధి చెందింది. ఫ్లవర్ వ్యాలీ, కగ్భుసండి సరస్సు, హేమ్ కుండ్ సరస్సు వంటి పర్యాటక ఆకర్షణతో పాటు అనేక ప్రసిద్ధ పర్వతారోహణ ప్రదేశాలు ఇక్కడ గొప్ప సాహసోపేత అనుభవాలను అందిస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR