చక్కెరను వాడని వారుండరు. టీ, కాఫీ, స్వీట్లరూపంలో ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటాం. కొందరైతే టీ, కాఫీలో ఎక్కువ మొత్తంలో షుగర్ వేసుకుంటారు. దీని వాడకం మన పూర్వీకులనుంచి వస్తోంది. ప్రస్తుతం పిల్లలు చాక్లెట్స్, కేకుల రూపంలో ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకుంటున్నారు. మరి ఇది తాత్కాలికంగా శక్తిని, ఆనందాన్ని ఇచ్చినా దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి నష్టం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో పరిశీలిద్దాం.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది :
ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారంటే.. మీ రోగనిరోధక శక్తిపైన ప్రభావం చూపుతుంది. తరచుగా జబ్బు పడటం, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సంకేతాలు మీలో కనిపిస్తూ ఉంటే.. వెంటనే చక్కెర తినడం తగ్గించండి.
ఎనర్జీ తగ్గిపోవడం, అలసట :
ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల తాత్కాలిక ఎనర్జీ శరీరానికి చాలానే అందుతుంది. కానీ వెంటనే వ్యతిరేక ప్రభావం చూపించడం వల్ల శక్తిని కోల్పోతారు. దీనివల్ల అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి.
పిండిపదార్థాల అలవాటు :
రోజూ ఎక్కువగా పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే.. మీకు అదే అలవాటుగా మారిపోతుంది. ఒక్కసారి వాటికి అలవాటు పడితే.. బయటపడటం చాలా కష్టం.
డిప్రెషన్ :
ఎక్కువగా పంచదార, పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల.. శారీరకంగా నిస్సత్తువగా, లేజీగా, డిప్రెసివ్ గా ఉంటారు. షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా.. తర్వాత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కుంగుబాటుకు, ఆందోళనకు కారణమవుతుంది. డిప్రెషన్ అనేది చక్కెర ఉత్పత్తులకు అడిక్ట్ అయ్యారని తెలిపే సంకేతం కావచ్చు.
చర్మ సమస్యలు :
ఎక్కువగా పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు ,చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి. జిడ్డు చర్మం, ఆక్ని , ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. మచ్చలకు కూడా కారణమవుతుంది.
బరువు పెరగటం :
శరీరానికి సరిపడేంత చక్కెర తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ క్యాలరీలుగా ఉత్పత్తై ఫ్యాట్ పెరగడానికి కారణమవుతాయి. ఇది ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ,గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
బీపీ :
పంచదార ఎక్కువగా తీసుకోవడం బీపీ పెరిగడానికి కారణమవుతుంది. అలాగే ఉప్పు కూడా బీపీ కి కారణమవుతుంది. బీపీ ఒక్కసారిగా పెరగడానికి చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం కూడా కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.
పంటి సమస్యలు :
ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల పళ్లకు హాని చేస్తుంది. క్యావిటీలకు కారణమవుతాయి. మీరు తరచుగా పంటి సమస్యలతో బాధపడుతున్నారంటే వెంటనే పంచదార తీసుకోవడం తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.