హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. అయితే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించిన రోజుగా, గణాధిపత్యం పొందిన రోజుగా ఈ రోజున వినాయకచవితి పండుగని జరుపుకుంటారు. మరి గణేష్ చతుర్థి ని బయట విధుల్లో జరుపుకోవడం ఎప్పుడు మొదలైంది? ఆలా జరుపుకోవడానికి కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలో మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ అప్పట్లో ప్రజల్లో ఐక్యతని ప్రోత్సహించడం కోసం మొదటగా అయన వినాయకచవితి వేడులను ప్రారంభించారు. ఆ తరువాత వారి వంశం నాశనం అయ్యాక ఈ వేడుకలు చేయడం అందరు మరిచిపోయారు. వినాయకచవితి అంటే ఇంట్లోనే పూజగదిలోనే పూజలు చేసుకునేవారు. ఇది ఇలా ఉండగా, బ్రిటిష్ వారు మన దేశంలో చొరబడి ప్రజలని బానిసలుగా చేసి పరిపాలిస్తుండగా 1892 వ సంవత్సరంలో స్వరాజ్యం నా జన్మహక్కు అంటూ సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి ప్రప్రథమ నాయకుడిగా నిలిచినా స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, భారతజాతీయోద్యమ పిత బాలగంగాధర తిలక్ గారికి పుణేలో గణేష్ వేడుకల గురించి తెలిసింది.
ఇక ఆ రోజుల్లో తిలక్ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజలను ఐక్యం చేసి వారిలో చైతన్యం తీసుకురావాలని భావించి గణేష్ వేడుకలను ఒక పెద్ద ఉత్సవంగా ప్రారంభించాలని భావించి మొదట మహారాష్ట్రలో గణేష్ విగ్రహాన్ని వీధిలో పెట్టి పది రోజుల పాటు ఉత్సవాలు చేస్తూ చివరి రోజున నిమర్జనం చేయడం మొదలు పెట్టాడు. ఇలా అయన మొదలుపెట్టిన ఆ గణేష్ ఉత్సవానికి కుల, మతం అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాగ ప్రజల్లో ఐక్యత పెరగడమే కాకుండా స్వరాజ్య ఉద్యమం అనేది మాములు ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ ఉత్సవం ఒక వేదికగా నిలిచింది. ఇలా మహారాష్ట్రలో ఈ ఉత్సవం తరువాత దేశం మొత్తం వినాయకచవితి వేడుకులు జరిగేలా దీనిని విస్తరించడానికి కృషి చేసారు.
ఇలా ఆయన ప్రజల్లో ఐక్యత తీసుకురావడానికి, భారతదేశానికి స్వరాజ్యం రావడం కోసం ఆ రోజు ఆయన ఆలోచించిన విధానమే నేడు మనకి దేశ వ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. కానీ నేడు ప్రజల్లో ఐక్యత కంటే స్వార్థం అనేది ఎక్కువగా ఉండటం, వీధికి ఒక వినాయక విగ్రహం చాలదు అన్నట్లుగా ఒక్కో వర్గానికి చెందిన వారు ఒక్కో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటూ, మట్టి విగ్రహాలని ప్రోత్సహించకుండా మన వినాయకుడు పెద్దగా ఉండాలి అందంగా ఉండాలి అంటూ పర్యావరణానికి హాని చేసే విగ్రహాలను పెడుతూ విలువలను గాలికి వదిలేస్తూ వినాయకచవితిని చాలా గొప్పగా జరుపుకుంటూ వస్తున్నాం