మన దైనందిన జీవితంలో పసుపు కూడా ఒక భాగమైపోయింది. నిత్యం ఏదో ఒక రకంగా పసుపును మనం ఉపయోగిస్తునే ఉంటాం. మరీ ముఖ్యంగా శుభకార్యాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇక మన దేశంలో అయితే పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలలో పసుపు ప్రధాన పాత్ర వహిస్తుంది.
ఉత్తర భారత దేశంలో కొన్నిచోట్ల పసుపు ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ పెద్ద వేడుకగా చేసుకుంటారు. మన తెలుగువారు ప్రత్యేకించి ఫంక్షన్‌గా కాకపోయినా పెళ్లికి ముందు గోరింటాకు పెట్టడం, పసుపు రాసి మంగళస్నానం చేయించడం మన పెళ్లిళ్లలోనూ ఉన్నదే. ప్రస్తుతం మన దగ్గర కూడా దీన్నో పెద్ద వేడుకగా చేస్తున్నారు.
అయితే అసలు పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి పసుపు ఎందుకు పెడతారో తెలుసా ? అసలు మన పెద్దవాళ్లు ఈ సంప్రదాయాన్ని ఎందుకు ప్రారంభించారు? పసుపు వల్ల వధూవరులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా..పసుపును తప్పనిసరిగా భాగం చేస్తారు. ఎందుకంటే ఇది మంగళప్రదమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుందని భావించడమే దీనికి కారణం. అంతేకాక శరీరంలో చేరిన దుష్ట శక్తులను పారదోలే పవర్ పసుపుకి ఉందట. అందుకే వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు గాను వారికి పసుపు రాస్తారు. పసుపు ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించడంలో బాగా పనిచేస్తుంది. వివాహ కార్యక్రమంలో పాల్గొనే వధూ వరులు మరింత ప్రకాశవంతంగా కనిపించాలనే ఉద్దేశంతోనే పసుపును వారికి రాసి స్నానాలు చేయిస్తారు.
పెళ్లి సమయంలో సాధారణంగా కేవలం పసుపు మాత్రమే కాకుండా చందనం, పాలు లేదా రోజ్‌వాటర్‌ని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పెళ్లి కూతురికి రాస్తారు. మరికొందరు ఇందులో పెరుగు, శెనగపిండి కూడా కలుపుతారు. దీన్ని రాసుకోవడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. దీంతో వారిలో పెళ్లి కళ ఉట్టిపడుతుందని పెద్దలు భావిస్తారు.
పసుపు చక్కటి డీటాక్సిఫైయర్, క్లెన్సర్. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మలినాలన్నీ తొలగిపోతాయి. అందుకే పసుపు రాసి పెళ్లి కూతురిని చేసిన తర్వాత బయటకు వెళ్లకూడదు అని పెద్దలు చెబుతుంటారు. మలినాలన్నీ తొలగిపోయిన తర్వాత పెళ్లి వరకూ బయట తిరగకపోవడం వల్ల పెళ్లిలో ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని వారి నమ్మకం. పసుపులో కర్క్యుమిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది. అంటే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. తలనొప్పిని కూడా దూరం చేస్తుంది.
పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వధూవరులకి ఆశీర్వాదాలు అందిస్తూ.. తనని అసలు వేడుకైన పెళ్లి కోసం సిద్ధం చేయడంతో పాటు.. కొత్తగా ప్రారంభించబోయే జీవితంలో కూడా అందం, ఆరోగ్యంతోపాటు, ఆనందంగా సాగాలని ఆశీర్వదించడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం.