Home Health రోజంతా ఇయర్ ఫోన్ పెట్టుకొని గడుపుతున్నారా… మీ చెవుల్లో ఈ సమస్యలు తప్పవు!

రోజంతా ఇయర్ ఫోన్ పెట్టుకొని గడుపుతున్నారా… మీ చెవుల్లో ఈ సమస్యలు తప్పవు!

0

మారుతున్న టెక్నాలజీ ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్ ఉంటే దాంతోపాటు ఎవ‌రి ద‌గ్గ‌రైనా క‌చ్చితంగా ఇయ‌ర్‌ఫోన్స్ ఉంటాయి. చాలామందికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోజంతా పాటలు వినడం, ఫోన్లో మాట్లాడే అలవాటు ఉంటుంది. ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు లేదా ఖాళీ స‌మ‌యాల్లో చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని పాట‌లు విన‌డ‌మో, సినిమాలు చూడ‌డ‌మో, గేమ్స్ ఆడ‌డ‌మో చేస్తుంటారు. గతంలో కేవలం టీనేజర్లు, యువత మాత్రమే ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ ఉపయోగించేవారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వాటిని వాడుతున్నారు. దీనికి తోడు ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించే సమయం కూడా పెరిగింది.

earphones in earకరోనా వైరస్ కారణంగా చాలా వరకు కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వగా, విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాయి. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లోనే ల్యాప్‌టాప్‌ ముందు సమయం గడిపేవారి సంఖ్య చాలా పెరుగుతోంది. ఆఫీస్ మీటింగ్స్, ఇతరత్రా అవసరాల కోసం ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వరుస మీటింగ్, కాల్స్, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి సంగీతం వంటివన్నీ ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా మారేలా చేశాయి. ఈ సందర్భాలలో ఇయర్ ఫోన్స్‌ను అతిగా వినియోగించడం వల్ల వినికిడి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చెవుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

లాక్ డౌన్ సమస్యల్లో చెవి ఇన్ఫెక్షన్లు, చెవిలో దురద, వినికిడి లోపాలు వంటి సమస్యలతో నిపుణుల వద్దకు వెళ్లే వారు ఎక్కువయ్యారట. అందుకే 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడకూడదని.. అలా వాడాల్సి వస్తే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే, వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు. ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం ద్వారా వినికిడి శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు వ‌స్తుంద‌ట‌. అలాగే మెద‌డు పనితీరు మంద‌గిస్తుంద‌ట‌. యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ట‌. ఇక చాలామంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని, అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వైద్యులు సూచిస్తున్నారు.

ఎక్కువ సమయం పాటు ఎక్కువ సౌండ్ తో శబ్దాలను వినడం వల్ల వినికిడి సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ జరుగుతుంది. 90 డెసిబెల్స్ అంటే చిన్న మెషీన్ల నుంచి వచ్చే శబ్దంలాంటిది అని చెప్పుకోవచ్చు. ఇంత శబ్దం రోజులో అత్యధికంగా ఎనిమిది గంటల పాటు వినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అంత కంటే పెద్ద శబ్దాలను రోజులో కేవలం పది నుంచి పదిహేను నిమిషాలకు మించి వినకపోవడం మంచిది. తప్పనిసరి అవసరం లేకపోతే ఇయర్ ఫోన్స్‌ను వాడకపోవడమే మంచిది. తప్పదు అనుకుంటే ఎక్కువ సమయం పాటు వీటిని ఉపయోగించకూడదు.

ఇలాంటప్పుడు కూడా ఓవర్ హెడ్ ఫోన్స్ ఉపయోగం మంచిది. ఇయర్ ప్లగ్స్ కంటే వీటి వల్ల కలిగే హాని చాలా తక్కువ. ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వ్యాపించవు. ఒకవేళ ఇయర్ ప్లగ్స్ ఉపయోగిస్తుంటే వీలైనంత తక్కువ సౌండ్ తో వినడానికి ప్రయత్నించాలి. అంతేకాదు.. వాటి రబ్బర్ టిప్స్ ని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఆల్కహాలిక్ సొల్యూషన్ తో శుభ్రం చేసి పొడిగా అయ్యాకే ఉపయోగించాలి. వాడని సందర్భాల్లో దీన్ని శుభ్రంగా ఉన్న డబ్బాలో భద్రపర్చాలి. ఒకవేళ చెవుల్లో దురదగా అనిపిస్తే కొబ్బరి నూనెతో రుద్దుకోవాలి.

ఇక ఇటీవల మార్కెట్లో లభిస్తున్న వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ మరింత ప్రమాదకరమని, వాటి వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. వైర్లతో పనిలేకపోవడం వల్ల వాటిని ఎక్కువ సేపు చెవికే ఉంచేస్తున్నారని, ఇది చాలా డేంజర్ అని అంటున్నారు. చెవి రంధ్రాలలోకి గట్టిగా ఫిట్ అయ్యే ఇయర్ ఫోన్స్ వల్ల చెవి లోపల పొడిబారిపోవడం, చర్మం రుద్దుకుపోవడం, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎదురవుతాయి. ఇయర్ ఫోన్లు తరచూ శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. స్నానం చేసిన తర్వాత లేదా ముఖం కడిగిన తర్వాత చెవిలో తేమ లేకుండా శుభ్రం చేసుకోండి. చెవి పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. వారంలో మూడుసార్లైనా చెవిని శుభ్రం చేసుకోండి.

Exit mobile version