సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో ఇంకా ఆలయం చుట్టూ పక్కల ప్రాంతాలలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి కొండ గుహలలో,ప్రకృతి అందాల నడుమ వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం, పుదుక్కోటై జిల్లాలో విరాళిమలై అనే పట్టణంలో శివుని కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది తిరుచిరాపల్లికి 28 కి.మీ. దూరంలో ఉన్నది. అయిత్ తమిళనాడు లో సుబ్రహ్మణ్యస్వామి ని మురుగన్ అని పిలుస్తుంటారు. ఈ దేవాలయం ఒక చిన్న కొండ మీద ఉంది. కొండపైకి వెళ్లేందుకు మెట్లమార్గం కలదు. ఇక్కడ కొండ ఎక్కేప్పుడు మార్గమధ్యంలో చొక్కనాదర్ మంటపం ఉంది. ఇందులో పార్వతి పరమేశ్వరులు, వినాయకుని ప్రతిమలు ఉన్నాయి. ఈ మంటపం మెట్లకు కుడి పక్కన చిన్న గుహలో ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్య భక్తుడైన అరుణగిరి నాదర్ కి కలలో మురుగన్ కనిపించి విరాళిమలై ఆలయం దర్శించమని చెప్పగా అరుణగిరి నాదర్ దట్టమైన వెదన్ కాత్తుర్ అడవుల గుండా ప్రయాణం చేస్తుంటే క్రూరమృగాలు ఆటంకం కలిగించకుండా మురుగన్ ఒక వేటగాని రూపంలో అతడిని రక్షించాడు. ఆవిధంగా అరుణగిరినాదర్ విరాళిమలై చేరుకున్నాడు. అరుణగిరినాధర్ కి చొక్కనాదర్ మంటపంలో అష్టమసిద్ధి లభించింది. ఆవిధంగా అరుణగిరి నాదర్ ని మురుగన్ ఆశీర్వదించాడు. ఈ భక్తుడు మురుగన్ మీద అనేక పాటలను వ్రాసాడు.
చొక్కనాదర్ మంటపం వెనుక నుండి ఒక అరణ్య మార్గం గుండా కొండకు మరోప్రక్కగా విరాలినదర్ గుహ ఉన్నది. ఈ గుహలో ఒక చిన్న బ్రహ్మ విగ్రహం ఉంది. గుహలో సొరంగ మార్గం గుండా కొండమీద ఉన్న గర్భగుడిలోకి చేరుకోవచ్చు. ఆరుముఖాలతో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రత్యేక్షమవుతారు. ఈ ఆలయంలో కంచు నారద విగ్రహం ఒకటి ఉంది. ఇలాంటిది దక్షిణాన ఇతర దేవాలయాలలో ఎక్కడ లేదు. అయితే ఈ ప్రాంతంపు రాజు గారు తీవ్రమైన ఉదరవ్యాధితి బాధపడుతుండగా, మురుగన్ ఆలయంలోని పూజారులకు కలలో కనిపించి రాత్రి పూట పూజ సమయంలో ఒక చుట్టను ఆయనకు ఇమ్మని ఆదేశించాడట. ఆవిధంగా ఆ రాజుగారి వ్యాధి తగ్గిపోయింది. అప్పటినుండి ఇక్కడ రాత్రి పూట చుట్ట ఇవ్వడం ఆచారంగా కొనసాగుతుంది. ఇలా వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడు నుండి అనేక మంది భక్తులు ఇక్కడకి వచ్చి స్వామిని దర్శిస్తారు.