ఈ ఆలయం దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి గాంచింది. ఇక ఈ ఆలయం నిర్మాణం చాలా అధ్భూతంగా ఉంటుంది. మరి ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, తిరువాయూర్ జిల్లాలోని మన్నార్ గుడి అనే పట్టణంలో శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం ఉన్నది. తంజాపూర్ నుండి 35 కి.మీ. దూరంలో వెన్నార్ నదీ తీరానగల ఈ క్షేత్రం దక్షిణ ద్వారకగా, చంపకారణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. కుంభకోణం నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
ఇచట చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీరంగంలో ఉన్న విధంగానే 7 ప్రాకారాలతో విరాజిల్లుచున్న రాజ గోపాలస్వామి ఆలయం ఒక అధ్భూత నిర్మాణం. ఈ క్షేత్రం నందు హరిద్రానది, స్వయంభు విమానము, శంఖు చక్ర, గజేంద్ర, కృష్ణ మొదలగు తీర్థములలో అమరియున్న ఈ క్షేత్రం గ్రోప్రళయ మహర్షికి ఆనాడు స్వామి తన లీలలను అనుగ్రహించిన స్థలంగా ప్రసిద్ధి చెందినది.
ఇక ముఖ్యాలయంలో రాజగోపాలస్వామికి తూర్పుముఖంగా ఎడడుగుల ఎత్తు ఉన్న విష్ణుమూర్తి శ్రీదేవి, భూదేవి సమేతుడై ప్రతిష్టింబడి ఉన్నాడు. ఈ ఆలయాన్ని కులాత్తుంగ చోళమహారాజు 1113 వ సంవత్సరంలో నిర్మించాడు. ఆలయంలో ఉన్న మూలవిరాట్టును వాసుదేవ పెరుమాళ్, అమ్మవారిని శంగామాల తయార్, ఉత్సవమూర్తిని రాజగోపాలస్వామి అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని తమిళ ఆళ్వార్ స్వాములు చాల ఆదరించారు. మనవాళ మహాముని ఈ ఆలయ విశిష్టతని తమిళంలో మంత్రం రూపంలో రచించారు. అయితే ఇది ప్రసక్తి కలిగిన గోపాల ఆలయం కాబట్టి దీన్ని దక్షిణ ద్వారకా అని కూడా పిలుస్తారు. ఇక్కడ 50 అడుగుల ఎత్తున్న గరుడాళ్వార్ ప్రతిమని ఆలయం ముందు ప్రతిష్టించారు. ఇక్కడే వేయిస్తంభాల ప్రార్థనా మంటపం కూడా ఉంది.
ఈ విధంగా వెలసిన ఈ రాజగోపాలస్వామి ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.