వినాయకుడు విగ్నాలను నివారించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ప్రతి పూజలోను ఆయనే మొదటగా పూజలందుకుంటాడు. మరి వినాయకుడి జన్మ రహస్యం ఏంటి? అయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు? వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణవిషయానికి వస్తే, పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడి భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యేక్షమై ఏ వరం కావాలో అని అడుగగా ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తధాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతి దేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీమహావిష్ణువు ప్రార్ధించగా అప్పుడు శ్రీమహావిష్ణువు నందిని గంగి రెద్దుల అలంకరించి, దేవతలందరు సంగీత వాయిద్యాలు పట్టుకొని గజాసురిడి దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఎం వరం కావాలో చెప్పమని అడుగగా, అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు, నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా, త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలనీ ప్రార్ధించగా, అప్పుడు గంగి రెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ మరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు.
ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలనీ తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలకి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్లిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చుసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా, అప్పుడు శివుడూ కలత చెంది గజ సూరిని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేసాడు.
ఇది ఇలా ఉండగా కొన్ని దినముల తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి చాలా బలశాలి. అందుకే ఆ స్వామి దేవతలందరికి సైనిక అధికారి అని చెబుతారు. ఒకసారి కొందరు మునులు, దేవతలు కలసి వచ్చి విఘ్నలను తొలగించుటకు ఒకరిని అధిపతిగా చేయాలంటూ కోరగా అప్పుడు పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటూ పరీక్షపెడతాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనం తో బయలుదేరుతాడు. కానీ మన బొజ్జ గణపయ్య మాత్రం ఆదిదంపుతుల చుట్టూ ప్రదిక్షణ చేస్తాడు. దానికి సంతోషించిన శివుడు వినాయకుడికి భాద్రపదశుద్ధ చతుర్ధి నాడ విఘనాధిపత్యమును ప్రసాదించెను. అప్పటినుండి వినాయకుడు విఘ్నదిపతిగా ముల్లోకాల యందు పేరుగాంచాడు.
ఇక వినాయకచవితి రోజు చంద్రుడిని చుస్తే నీలాపనిందలు తప్పవు అని చెప్పడం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, పూర్వం భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులు పెట్టిన నైవేద్యం ఆరగించి తన వాహనం అయినా ముషికంతో కైలాసనాకి వచ్చి పార్వతీపరమేశ్వరులకి వంగి దండం పెడుతుండగా ఉదరం అడ్డు రావడంతో చాలా ఇబ్బంది పడటం చూసి శివుడి శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు వినాయకుడి ఉదరం పగిలి ఉడుములు, ఉండరాళ్ళు రావడంతో పార్వతీదేవి ఆగ్రహానికి గురై, ఇలా కించపరుస్తూ నవ్వినందుకు ఇప్పటినుండి నిన్ను ఎవరు చూసిన వారు పాపాత్ములై వారికీ నీలాపనిందలు తప్పవంటూ శపించింది. అప్పుడు కొన్ని దినముల తరువాత చంద్రుడిని చూసిన కొందరు ఋషులు నీలాపనిందలు ఎదుర్కొని వారి బార్యలకి దూరం అవుతారు. ఇక అందరు కలసి ఆ దేవిని ప్రార్ధించగా అప్పుడు పార్వతీదేవి కనురించి ప్రతి దినం కాకుండా ఏ రోజు అయితే చంద్రుడు వినాయకుడిని అవమానించాడా ఆ రోజు చంద్రుని చూసినవారికి పాపాత్ములై వారికీ నీలాపనిందలు తప్పవని చెబుతుంది. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయకచవితి రోజున చంద్రుడిని చూడకూడదు అని అంటారు. శమంతకమణి వృత్తాంతం ప్రకారం శ్రీకృష్ణుడు కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూసి అపనిందలు ఎదుర్కొన్నాడని పురాణం.
వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దానికి ఒక కథ ఉంది, పూర్వం పరశురాముడు శివుడి కోసం తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చిన శివుడు పరుషును ప్రసాదిస్తాడు. తన వార ప్రసాదం అయిన గొడ్డలితో పరశురాముడు కార్త వీర్యార్జునుడిని చంపివేసి ఆ తరువాత 21 సార్లు రాజులపైనా దండెత్తి వారిని చంపివేసి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు వారి ఏకాంతానికి భంగం కలుగకుండా లోపలికి ప్రవేశం లేదంటూ పరశురాముడు అడ్డుకోగా ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గొడ్డలిని వినాయకుడిపైన విసిరివేయగా, తన తండ్రి ఇచ్చిన పరుశువుకు గౌరవించి దాన్ని అడ్డుకొనకుండా తన ఒక దంతాన్ని ఆ గొడ్డలికి సమర్పిస్తాడు. ఇలా అప్పటినుండి వినాయకుడు ఏక దంతుడయ్యాడు.
వినాయకుడి ఎలుక వాహనం వెనుక ఉన్న కథ ఏంటంటే, పూర్వం క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఒకసారి సభలో అసభ్యంగా ప్రవర్థించడమే కాకుండా సభకి ఆటంకం కలిగించినందుకు ఆగ్రహానికి గురైన ఇంద్రుడు తక్షణమే ఏలుకుగా మారిపోమంటూ శపంచాడు. క్రౌంచుడు ఎలుకగా మారినప్పటికీ తన వైఖరి అలానే ఉండటంతో ఈ లోకాన్ని వదిలి భూలోకంలో జీవించు అంటూ భూమిపైనా విసిరివేయగా ఎలుకగా మారిన క్రౌంచుడు పరాశరుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇలా ఆశ్రమం చేరుకున్న అతడు అక్కడు ఉన్న ధాన్యాలను తింటూ తునాతునకలుగా చేస్తుండేవాడు. ఆ ఆశ్రమానికి వచ్చిన వినాయకుడికి సంబంధించిన వస్తువులను కూడా అలానే చేయడంతో పరాశరుడు విసిగిపోయి దీనికి మార్గం మీరే చూపాలని వేడుకొనగా అప్పడు వినాయకుడు ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని దానిపైనా ప్రయోగించగా అది ఎలుక మీదకి చుట్టుకొని పోయింది. అప్పుడు ఆ ఎలుక చేసేది ఏమిలేక ఆ పాశాన్ని పట్టుకొని వచ్చి విడిపించమని వినాయకుడ్ని వేడుకుంది. అంతేకాకుండా తనకి శాపవిమోచనం కలిగించమని కోరుకొనగా అప్పుడు వినాయకుడు ఇంద్రుడు ఇచ్చిన శాపానికి నేను శాపవిమోచనాన్ని కలిగించలేను కానీ నీవు నా వాహనమై నాతో పాటు పూజలందుకోమని వరాన్ని ప్రసాదించగా అప్పటినుండి ఎలుక వినాయకుడి వాహనము అయిందని పురాణం.
ఇక కొన్ని కథల ఆధారంగా వినాయకుడు బ్రహ్మచారి అని అంటే ఆ స్వామికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు అని మరి కొన్ని కథలు ఉన్నాయి. అంతేకాకుండా వినాయకుడికి ఇద్దరు కుమారులు వారి పేర్లు క్షేమము, లాభము అని చెబుతారు. వీరినే ఉత్తర భారతంలో శూభము, లాభము అని వ్యవహరిస్తారు.
ఈవిధంగా మన హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి అయి అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడుగా, విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడిగా పూజలని అందుకుంటున్నాడు.