హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు హిమాలయాల్లో నివసిస్తుంటారు. హిమాలయాలు ఆసియాలోని భారతదేశం, నేపాల్, పాకిస్థాన్, చైనా మరియు భూటాన్ దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇక ఈ మంచు కొండల్లో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి మంచు కొండల్లో ఉన్న ఆ అద్భుత ఆలయాలు? ఆ ఆలయాల్లో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కైలాస పర్వతం:
హిమాలయాల్లోని మానస సరోవరం ఒడ్డున కైలాస పర్వతం ఉంది. టిబెట్ భూభాగంలో సముద్రమట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. కైలాస పర్వతం సింహం, గుర్రం, ఏనుగు, నెమలి ఆకారంలో ఒక్కో వైపు ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా నాలుగు వైపులా నాలుగు రంగుల్లో బంగారు, తెలుపు, కాషాయం, నీలం రంగుల్లో కనిపిస్తుంటుంది. కైలాస పర్వతం మధ్యలో ఉండగా ఈ పర్వతం చూట్టు ఒక ఆరు పర్వతాలు ఉంటాయి. యాత్ర చేసే భక్తులు ఈ పర్వతాల చూట్టు మాత్రమే ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇప్పటివరకు ఎవరు కూడా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. ఇక కైలాస పర్వతం చూట్టు ప్రదక్షిణ అనేది చేయాలంటే సరైన వాతావరణం ఉంటె మూడు నుండి నాలుగు రోజుల సమయం పడుతుంది. పౌర్ణమి రోజుల్లో కైలాస పర్వతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. శివుడు ఇక్కడ మానస సరోవరంలో స్నానం చేసేవాడని పురాణాలూ చెబుతున్నాయి.
జోషిమఠ్:
ఉత్తరాఖండ్ రాష్ట్రం, హృషీకేశ్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో జోషిమఠ్ అనే పవిత్ర క్షేత్రం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులు ఉన్నాయి. కుబేరుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ మఠం ప్రాంగణంలోనే కల్పవృక్షం అనే వృక్షం ఉంది. ఈ వృక్షం దాదాపుగా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల కాలం నాటిదిగా చెబుతారు. ఈ చెట్టు మొదలు సుమారుగా 40 అడుగులు ఉంటుంది. అయితే ఆది శంకరాచార్యుల వారు ఈ చెట్టు క్రిందే కూర్చొని తపస్సు చేయగా, ఆయనకు ఆత్మసాక్షాత్కారం లభించినది. ఇంకా ఆయనకి బ్రహ్మ జ్ఞానం ఒక జ్యోతిరూపంలో కనిపించిందట. అందుకే ఈ మఠానికి జ్యోతిర్మఠం అనే పేరు వచ్చింది.
ముక్తినాధ్ ఆలయం :
నేపాల్ దేశంలో మస్తంగ్ జిల్లాలో 12 వేల అడుగుల ఎత్తులో ముక్తినాధ్ ఆలయం ఉంది. నారాయణడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు ముక్తి నారాయణుడిగా పూజలను అందుకుంటున్నాడు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాలలో, అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. కానీ ఈ ఆలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ 108 నంది ముఖాల నుండి ఎప్పుడు చల్లని నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే జ్వాలామాత ఆలయం ఉంది. ఇక్కడ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. దీనిని దైవ మహిమగా భావిస్తూ ఈ జ్యోతిని జ్వాలామాయిగా భక్తులు కొలుస్తారు. ఇంకా ఇక్కడే గండిక నది జన్మస్థలం ఉన్నది. ఇక్కడ దొరికే నల్లని రాయిని సాలిగ్రామం అంటారు.
లక్ష్మివన్ :
ఉత్తరాంచల్ రాష్ట్రంలోని బదరీనాథ్ నుండి మంచు కొండల్లో సుమారు 9 కీ.మీ. కాలినడక ప్రయాణం చేయగా సముద్రతీరానికి దాదాపుగా 10,800 అడుగుల ఎత్తులో లక్ష్మివన్ అనే ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే ద్రౌపతి ప్రాణ త్యాగం చేసిన స్థలంగా చెప్తారు. ఇక్కడి ప్రదేశం నుండి అలానే వెళితే చక్రతీర్ద్ అనే ప్రదేశం వస్తుంది. అయితే సంవత్సరంలో జులై, ఆగస్టు నెలలో మాత్రమే ఇక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి క్షేత్రంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చక్రప్రయోగా విద్యను నేర్పించాడని తెలుస్తుంది. ఈ ప్రదేశంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక తొమ్మిది మంది మాత్రమే నిద్రించగల ఒక గుహ ఉంటుంది.
శ్రీ ఖండ్ మహాదేవ ఆలయం :
హిమాచల్ ప్రదేశ్, సరహన్ లో శ్రీ ఖండ్ మహాదేవ ఆలయం ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 5100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పురాణాల ప్రకారం, పూర్వం ఆ పరమేశ్వరుడు ఇక్కడి పర్వతం పైనే ధ్యానం చేసాడని చెబుతారు. ఈ పర్వతాన్ని చేరుకొని శివలింగాన్ని దర్శించడం అనేది అందరికి సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ పర్వత శిఖరాలపైనా మంచు లో వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా సంవత్సరంలో ఇక్కడి వెళ్ళడానికి పర్వత శిఖరంపైన అన్ని రోజులో వాతావరణం అనేది అనుకూలించదు అందుకే సంవత్సరంలో కేవలం జూన్ నెలలో మాత్రమే 15 నుండి 20 రోజులు మాత్రమే వెళ్ళడానికి అనుమతి అనేది ఉంటుంది.
గంగోత్రి:
ఉత్తరాంచల్ రాష్ట్రం లో కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగే ప్రదేశం గంగోత్రి. ఈ ప్రముఖ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయ పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డున ఉంది.
అమర్నాథ్ ఆలయం:
జమ్మూ – కాశ్మీర్ లో అమర్నాథ్ పర్వతం పైన అమర్నాథ్ గుహలు ఉన్నాయి. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అమర్నాధ్ గుహాలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శివుడికి అంకితం చేయబడిన ఈ పవిత్ర గుహాలయం దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపుగా 3,888 మీ. ఎత్తులో ఉంటుంది. జూన్ సమయంలో అమర్నాథ్ యాత్రలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ఏర్పడ్డ సహజ మంచు శివలింగాన్ని దర్శిస్తారు.
కేదార్ నాథ్:
కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. చార్ ధామ్ అనబడే నాలుగు క్షేత్రాలలో కేదార్ నాథ్ ఒకటి. కేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది.
తుంగ్నాద్ ఆలయం:
ఉత్తరాఖండ్, రుద్రప్రయాగ జిల్లా లో చొప్త అనే ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది. అయితే చొప్త నుండి 4 కీ.మీ. దూరంలో తుంగ్నాద్ ఆలయం ఉంది. ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడినదిగా చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. సముద్రమట్టానికి దాదాపుగా 3680 కిలోమీటర్ల దూరంలో తుంగ్నాద్ పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరం పైనే ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు. అయితే ఎప్పుడు మంచు ఉండే ఈ ఆలయాన్ని దర్శించాలంటే సరైన సమయం మార్చి నుండి అక్టోబర్. ఇక్కడికి దగ్గరలోనే చంద్రకిలా శిఖరం ఉంది. ఇక్కడ శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం పోవడానికి శివుడిని పూజించాడని చెబుతారు.