అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతానికిది ప్రతీక. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మించబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఇది జ్యోతిర్లింగమని.. తేజోలింగం కాబట్టి అగ్ని క్షేత్రమంటారు.
ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనంటారు. సృష్టిలోని పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల ఆగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు. అరుణాచలం అంటే అరుణ – ఎర్రని, అచలము – కొండ. ఎర్రని కొండ అని అర్ధం. అ-రుణ అంటే పాపాలకు పరిహారం చేసేది అని అర్ధం. తమిళంలో ” తిరువణ్ణామలై ” అంటారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము.
తలుచుకున్నంత చేతనే ముక్తినొసగే క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటంటే పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం విష్ణులోకం వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపం ధరించో లేక ఈగ, చీమ, చిలుక, రంగు రంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపాలను దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము చేసి మ్రొక్కుతూ ఉంటారు.
అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిధ్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షివంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. ఆది అణ్ణామలైలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మదేవుడు చేశాడంటారు. ఇక్కడ అమ్మవారు అణ్ణములై అమ్మాళ్. ఇది కూడా పెద్ద ఆలయం.
ఏ నెలైనా పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రిగల పౌర్ణమిరోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరిప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశంలేదు. అంత విశాలమైన మార్గంలోకూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తికాదు. భక్తులు ఎంత భక్తి శ్రధ్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిధ్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు.
గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి , శివస్మరణవల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.
- గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.
- గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
- బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ వెంట తీసుకువెళ్ళకండి.
- ఉదయం పూట గిరి ప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
- గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
- మీరు చిల్లర తీసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
అరుణాచలేశ్వర దేవాలయం చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు ( సి.యమ్.బి.టి ) బస్ స్టాండ్ నుంచి అరుణాచలం చేరడానికి 4 లేదా 5 గంటల సమయం పడుతుంది.