శివుడు కొలువై ఉన్న ఈ ఆలయం పేరు రుద్రేశ్వరాలయం. అయితే ఈ ఆలయానికి అనుకోని విడిగా ఒక కల్యాణమండపం ఉంది. ఆ మండపంలో వేయి స్థంబాలు అనేవి ఉన్నాయి. అందువలన ఈ ఆలయానికి వేయి స్తంభాల గుడి అనే పేరు సార్ధకమైంది. అయితే ఈ ఆలయంలో గర్బగుడిని త్రికూటాలయం అని పిలుస్తారు. ఇంకా గర్భగుడిలో ఉండే ద్వారబంధం ఒక అధ్బుతం. మరి ద్వారబంధం, త్రికూటాలయం ఏంటి? ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హనుమకొండ నగరంలో వేయి స్తంభాల గుడి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభరాజంలా జీవకళ ఉట్టిపడుతుంది. ఈ ఆలయం కాకతీయుల కళావైభవానికి దర్పణం పడుతుంది. ఇంకా వారి సంస్కృతి, సాంప్రదాయాలకు తార్కాణంగా నిలుస్తుంది. రుద్రేశ్వరాలయం ముఖద్వారంపై మనోహరమైన తోరణశిల్పం ఉంది. దీనితో పాటు నర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు, ఆలయ రాతి గోడలు, అంతరాలయ ద్వారాలు, అధ్భూతమైన శిల్పాలతో ఆకర్షిస్తుంది.
ఈ రుద్రేశ్వరాలయం ప్రోలరాజు, ముప్పమాదేవిల కుమారుడైన రుద్రదేవ మహారాజు చేత క్రీ.శ. 1163 వ సంవత్సరంలో ప్రతిష్టించబడినట్లు ఇక్కడ ఉన్న ఒక శిలా శాసనం మనకి తెలియచేస్తుంది. అయితే ఆ తరువాత విశిష్టమైన నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్యకాలంలో రుద్రదేవుడు నిర్మించాడు. అయితే కాకతీయ రాజులూ ఇక్కడి నుండి తవ్విన సొరంగం మార్గం నుండి శ్రీ భద్రకాళి దేవాలయానికి, ఖిల్లా వరంగల్ కు, రామప్ప దేవాలయానికి వెళ్లే వారని పూర్వికులు చెబుతారు.
ఈ ఆలయం మొత్తం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న పునాదిమీద నిర్మించబడింది. ఈ పునాది 31 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా శ్రీ చక్రం ఆకారంలో నిర్మింపబడ్డది. ఇలా ఈ ఆలయ నిర్మాణ శైలి అనేది దేశంలో మరెక్కడా కూడా కనిపించదు.
ఇక ఆలయ విషయానికి వస్తే, త్రికూటాలయానికి ముందుభాగంలో నంది విగ్రహం మణికిరీటంగా చెప్పవచ్చు. ఆలయ పీఠం కూడా నక్షత్రాకృతి త్రికూటాలయాల మధ్య నున్నని నల్లరాతి చెక్కడాలు, వలయకార దర్పణం లా కనపడుతుంది. అయితే దానిపైన పడిన సూర్యకాంతి గర్భగుడికి వెలుగు నివ్వడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ ఆలయానికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథ అనేది ఉంది. అయితే కాకతీయులు తెలుగు నేలను పాలిస్తున్న రోజుల్లో, ప్రోలయ రాజు ధర్మ పరిపాలన చేస్తుండగా ఆయనికి ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే అతని ద్వారా తండ్రికి మరణం సంభవిస్తుంది అనే వార్త జ్యోతిష్కుల ద్వారా తెలుసుకొని అతనిని ఒక బ్రాహ్మణుని వద్ద ఉంచగా, కొంతకాలం తరువాత జ్యోతిషులు చెప్పిన విధంగా కొడుకు చేతిలో తండ్రి మరణిస్తాడు. ఆవిధంగా తండ్రి మరణానికి కారకుడైన తనను తాను నిందించుకొని తండ్రి ఆత్మశాంతికి ఈ ఆలయాలను నిర్మించాడు. అంతేకాకుండా తన రాజ్యంలో నలుమూలల ఇంకా ఎన్నో నిర్మింపజేయించి కొంత దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.
ఇది ఇలా ఉంటె కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భూతమైన వాస్తు కళతో అలరాలుతూ చూసే వారు ఆశ్చర్యానికి గురవుతారు. ఇక నల్లరాతితో మలచబడిన నందీశ్వరుని విగ్రహం కల్యాణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవిగా దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉన్నాయి. తూర్పుముఖంగా ఉన్న దానిలో శివలింగ మూర్తి, దక్షిణ ముఖంగా ఉన్న దానిలో వాసుదేవరా అనే పేరుతో విష్ణుమూర్తి విగ్రహం, పశ్చిమ ముఖంగా ఉన్న దానిలో సూర్య దేవర విగ్రహములు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఒకేవేదిక మీద ముగ్గురు దేవతామూర్తులకు విడివిడిగా గర్బగుడిలు ఉండేట్లు నిర్మించడం అపూర్వమనే చెప్పవచ్చు. ఈ రకమైన నిర్మాణం ఉంది కనుకే ఈ నిర్మాణాన్ని త్రికూటాలయం అంటారు.
గర్భగుడిలో ఉన్న రుద్రేశ్వర లింగవిగ్రహమూర్తి. ఈ మూర్తి మొత్తం సుమారు 48 అంగుళములు ఎత్తుతో ఒక తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మరొక ఆధ్బుతం ఏంటంటే, సాధారణంగా ఏ ద్వారబంధమైన దాని ప్రక్కన ఉన్న గోడలోకి దూర్చి బిగించబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ద్వారబంధం గోడకంటే ఒక అడుగు ముందుకు ఉంటుంది. అంటే గోడకి అంటకుండా ద్వారబంధాన్ని ఒకదాన్ని విడిగా నిలబెట్టినట్లు ఉంటుంది. అయితే సుమారు పదహారు అడుగుల ఎత్తున, పన్నెండు అడుగుల వెడల్పు ఉండే ఈ ద్వారబంధం మొత్తం ఒకే రాతి ఫలకం. ఇంత పెద్ద శిలాఫలకాన్ని గోడకు అంటకుండా నిలబడి ఉండేట్లు అమర్చబడి చెక్కిన శిల్పుల నైపుణ్యం అమోఘం అని చెప్పాలి.
ఈవిధంగా దేశంలో లేని విధంగా ఎన్నో అధ్బుతాలు ఉన్న వేయి స్తంభాల గుడికి మహాశివరాత్రి రోజున కొన్ని లక్షల్లో భక్తులు వచ్చి ఆ రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్దలతో దర్శించి తరిస్తారు.