నాట్యం నేర్చుకునే చోట నటరాజ స్వామి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. నాట్యం పోటీలలో కూడా ముందుగా నటరాజస్వామిని పూజిస్తారు. ఇంతకీ ఆ విగ్రహానికి అంతరార్ధం ఏమిటో తెలుసుకుందాం. పరమేశ్వరుడు పరమానంద స్వరూపుడనీ, నాట్యం పరమానందానికి ఒక సూచిక అనీ, పరమానందాన్ని ప్రాణ కోటికి అందించడమే నటరాజ నాట్యంలోని అంతరార్థమనీ అర్చక స్వాములు చెబుతారు.
నటరాజు రూపంలోని శివుడి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో దర్శనమిస్తాయి. శైవమతాభిమానులైన చోళుల కాలంలోనే వీటికి విశేష ప్రాధాన్యత లభించింది. వారు నిర్మించిన ఆలయాల్లో ఈ రూపంలో శివుడిని ప్రతిష్ఠించారు. పది, పదకొండో శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, నటరాజ రూపంలోని శివుడి విగ్రహాలను ఇత్తడితో రూపొందించారు.
ఈ రూపంలోని శివుడి కురులు గాలిలో ఎగురుతూ ఉంటాయి. మరుగుజ్జు బొమ్మపై నిలబడి శివుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మరుగుజ్జు వ్యక్తి అపస్మార పురుషుడు (అంటే మానవులోని అజ్ఞానికి) చిహ్నం. శివుడు తన తాండవంతో అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణచివేస్తాడు. కుడి వైపున వెనుక ఉండే చేతిలో ఢమరుకం, ముందు ఉండే చేయి అభయ ముద్రను సూచిస్తాయి.
ఎడమవైపు ఉండే వామ హస్తం అగ్నిని కలిగి ఉంటుంది. ముందు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరేసినట్లు ఉంటాయి. జటాఝూటంలో గంగ, తలపై చంద్రుడు అర్థ చంద్రాకారంలో ఉంటారు. ఈ మొత్తం ఆకారం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది. నటరాజ స్వరూపం ఓంకారాన్ని సూచిస్తుంది. పై వరుసలో ఉండే అగ్ని లయాన్ని ప్రతిబింబిస్తుంది. అగ్ని ఉన్న ఈ వృత్తం జనన మరణాలకు నెలవైన భూగోళం. శిరస్సుపై ఉండే తంగేడు పుష్పం ప్రకృతికి చిహ్నం. జటాఝూటం నుంచి జాలువారే గంగ పాపాలను హరించే పరమపావని స్వచ్ఛతకు, ఙ్ఞానానికి ప్రతీక. నెలవంక సృష్టికి చిహ్నం.
చేతిలోని ఢమరుకం క్రమబద్దమైన లయానిత్వ సృష్టిని తెలుపుతుంది. ఇది జననమరణాల క్రమం. నటరాజు పాదాల కింద ఉండే పద్మం పునర్జన్మకు ప్రతీక. నర్తనం/ నాట్యం రెండు రకాలు. లాస్యం సృష్టి కారకం. తాండవం లయకారకం.