మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోబోయే ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. ఆ ఆలయ రహస్యాలు తెలుసుకుందాం.
నిష్కలంక మహదేవ్ ఆలయం అన్ని సాధారణ ఆలయాలకు ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి, సముద్రానికి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు. కొలియాక్ కు తూర్పున సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఉంది.
మహా భారత యుద్ధంలో పాండవులు గెలిచినా వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడిని శరణు కోరగా శ్రీకృష్ణుడు ‘ఒక నల్లని ఆవుకు నల్లని జండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్లమని, ఎప్పుడైతే ఆ ఆవూ, జండా రెండు తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపం నుంచి ముక్తి లభిస్తుందని ‘ చెబుతాడు. ఆ మేరకు పాండవులు రోజులతరబడి ఆ ఆవు వెంట నడిచి వెళతారు. చివరికి కొలియాక్ గ్రామం సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరగానే ఆవు, జెండా తెల్లగా మారిపోతాయి.
ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ఆ పంచ పాడవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. ఆనందంతో పాండవులు ఆ అయిదు లింగాలకుపూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ విధంగా పాండవులకు కళంకాలు తొలిగిపోగా ఆ ప్రదేశమే నిష్కలంక్ మహాదేవాలయంగా ప్రసిద్ధి పొందిందని పురాణ గాధ.
కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు.
ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం దగ్గర సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.
ఉదయం పది గంటలకే భక్తులు సముద్ర తీరానికి వస్తారు. రానురాను అలల ఉదృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఓ స్తూపము, ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు వెళ్లి ఆ లింగాలకు పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, మహా శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. మరణించిన తమ పెద్దల అస్తికలను అక్కడ సముద్రంలో కలిపితే వారి అత్మ శాంతిస్తుందని భక్తుల విశ్వాసం.