ఇక్కడ ఉన్న ఈ ఆలయ ప్రాంతంలో వేయిమంది మునులు తపస్సు చేసినందుకు ‘వేయి మునుల కుదురు’ అన్న పేరొచ్చింది. అదే కాలక్రమంలో యనమలకుదురుగా స్థిరపడింది. దీనినే ఇంకా మునిగిరి అనీ కూడా పిలుస్తుంటార. అయితే ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆలయంలో ఎవరు కొలువై ఉన్నారు? అక్కడి ఆలయ పురాణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ శివారులోని యనమలకుదురు కొండమీద పార్వతీ రామలింగేశ్వరాలయం ఉన్నదీ. పవిత్ర కృష్ణాతీరంలో వాయులింగంగా శివుడిక్కడ పూజలు అందుకుంటున్నాడు. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా వెలుగొందింది. ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని విశ్వసించేవారు. ఎక్కడెక్కడి సాధకులో వచ్చి ఇక్కడ ఘోరతపస్సు చేసేవారు. ఇప్పటికీ ఈ గాలిలో ఓంకార నాదం వినిపిస్తుందని ఓ ప్రచారం.
పరమశివుడి మహాభక్తుడూ, ప్రియశిష్యుడూ అయిన పరశురాముడు స్వయంగా పునఃప్రతిష్ఠించిన లింగమిది. కాబట్టే, విజయవాడలోని యనమలకుదురులో కొలువైన పార్వతీరామలింగేశ్వరుల్ని పూజిస్తే కష్టాలూ నష్టాలూ గొడ్డలితో కూల్చినట్టు సమూలంగా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఇక ఆలయ పురాణానికి వస్తే, దశావతారాల్లో ఆరవది పరశురామ అవతారం. త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు. ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన గొడ్డలిని కానుకగా పొంది పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు.
ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. అదీ పరశురాముడి శక్తి!
ఒకానొక సందర్భంలో అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రి మాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు. కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆతర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు.
మళ్లీ సీతాస్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యానికి కూడా వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలసిన పార్వతీరామలింగేశ్వరస్వామిని దర్శించుకుని వేదోక్తంగా పునఃప్రతిష్ఠంచినట్టు స్థానికుల విశ్వాసం. అదే సమయంలో కొండపై నుంచి నదీప్రవాహం వరకూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించాడని అంటారు. కాలక్రమంలో అవి భూగర్భంలో కలసిపోయాయి.
విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది. వనవాస సమయంలో సీతారాములు రామలింగేశ్వరస్వామిని పూజించారని కూడా ఓ కథనం. ఎంతోమంది పాలకులు ఆదిదంపతుల్ని అర్చించి తరించారు. చాళుక్యులూ కాకతీయులూ రెడ్డిరాజులూ విజయనగర ప్రభువులూ మునిగిరి మహాదేవుడిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యాల్నీ అనావృష్టినీ చోరభయాల్నీ పరశురాముడు గొడ్డలి రూపుమాపుతాడని భక్తుల నమ్మకం.
మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటూ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవం రోజు రాత్రి రంగురంగుల విద్యుద్దీపాల మధ్య మేలుజాతి వృషభాలతో, మేళతాళాలతో ప్రభలను గిరి ప్రదక్షిణ చేయిస్తారు. శివరాత్రి తెల్లవారి స్వామివారి కల్యాణం, గ్రామోత్సవం ఘనంగా జరుగుతాయి. మూడో రోజున పార్వతీరామలింగేశ్వరస్వామి వసంతోత్సవం కనులవిందుగా నిర్వహిస్తారు. కష్టాలను తొలగించాలని కోరుతూ గండదీపాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
రామలింగేశ్వరస్వామిని ఒకసారి దర్శిస్తే, వేయిమంది మునుల అనుగ్రహాన్ని అందుకున్నంత ఫలమని భక్తుల నమ్మకం.