పూర్వం త్రేతా యుగంలో నారద మహాముని దేశ సంచారం చేస్తూ పుణ్య స్థలాలను దర్శిస్తున్నాడు. అలా దర్శిస్తూ ఒకనాడు నారదమహాముని తమసా నదీతీరాన ఉన్న వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, “మహాత్మా, ఈ యుగంలో ఈ లోకంలోసకల సద్గణ సంపన్నుడూ, మహాపరాక్రముడూ అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?” అని అడిగాడు.
అప్పుడు నారద మహర్షి మనసులో లోకకళ్యాణార్థమే నాకు నీ దర్శనం కలిగింది అనుకున్నాడు. వాల్మీకికి నారద మహాముని రాముడి కథ పూర్తిగా చెప్పాడు. నారదమహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయే సరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయింది. వాల్మీకి, శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక క్రౌంచపక్షుల జంట కనిపించింది. నారబట్ట కట్టుకుని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నాడు.
ఇంతలో ఒక బోయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు. అది కిందపడి గిలగిలా కొట్టుకుంది. ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది. ఆ పక్షుల బాధ వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఉంది. వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలీ, కిరాతకుడైన బోయవాడి పైన ఆగ్రహం తన్నుకునివచ్చాయి. “ఓరి కటిక వాడా, ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు,” అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో బయటికి వచ్చింది. తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే ఆశ్చర్య పోయాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడడానికి వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి, అర్ఘ్యపాద్యాలిచ్చి, ప్రశంసించి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, “వాల్మీకీ, నా అనుగ్రహం చేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకు ముందే రాముడి కథ విన్నావు కదా, ఆ కథను మహాకావ్యంగా రచించు.
అది భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అది ఉన్నంతకాలం నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. అంతే కాదు ఎంతో మందికి రామాయణం ఆదర్శంగా ఉంటుంది. ముందు తరాలకు ధర్మ బద్ధమైన దారిని చూపిస్తుంది. నీవు ఉత్తమ లోకాలలో సంచరించ గలవు, ” అని చెప్పి అంతర్థానమయ్యడు.
ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి పూర్వీకుల నుండి వారి గొప్పతనం లికించబడి ఉంది. సూర్యుడి కొడుకు దగ్గర రామాయణం ప్రారంభమయింది. సూర్యుడి కొడుకు వైవస్వతుడు. కనుకనే సూర్యవంశం అంటారు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు. ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పిలవబడి ప్రసిద్ధికెక్కారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే.
సూర్యవంశపు రాజులు అయోధ్యా నగరం రాజధానిగా కోసలదేశాన్నిపాలించారు. అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరధుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరధుడు ఐశ్వర్యంలోఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు, మహాపరాక్రమ సంపన్నుడు. ఆయన పుత్రుడే శ్రీరాముడు.