ఏక శిలా నిర్మిత ప్రతిమలు..
చైత్రశుద్ధ పౌర్ణమి కళ్యాణం..
జాంబవంతుడు ప్రతిష్టించిన విగ్రహాలు..
హనుమంతుడు లేని రాముని గర్భగుడి,,
భారతదేశపు అత్యుత్తమ నిర్మాణాలలో ఇదొకటి..
పలికేది భాగవతమట పలికించెడివాడు రాముండట..
ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఒక ఆలయానికే ఉండటం అరుదు. అలా అరుదైన క్షేత్రమే అదే ఒంటిమిట్ట కోదండ రామాలయం.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో భద్రాచలంలో జరుగుతున్న రాముని కళ్యాణం, రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్టలో సీత రాముల కళ్యాణం చేయటం ఆచారంగా మారింది..అయితే సాధారణంగా ఎక్కడైనా శ్రీరామ నవమి రోజున చేసే సీతారాముల కళ్యాణం, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత వచ్చే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆరుబయట వెన్నెల్లో జరగటం విశేషం.. మరి ఈ ఆచారం ఎందుకు వచ్చింది.. ఈ ఆలయ విశిష్టత, ఒంటిమిట్ట స్థలపురాణం మనం ఇపుడు తెల్సుకుందాం..
పూర్వం దండకారుణ్య ప్రాంతంగా పిలవబడు ఈ ప్రాంతంలో యజ్ఞ యాగాలు చేసుకుంటున్న మునులను రాక్షసుల బారి నుండి కాపాడమని శరణు వేడిన మునులకు అభయమిస్తూ రాముడు కొద్దికాలం పాటు ఈ ప్రాంతంలో నివసించాడని ప్రతీతి. ఆ సమయంలో సీతా దేవి దప్పిక తీర్చడానికి స్వయంగా తన బాణంతో పాతాళం నుండి బుగ్గను రప్పించాడనీ దానికి సజీవ సాక్ష్యాలే రామ తీర్థం, లక్ష్మణ తీర్థం ..
ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వడ్డె కులానికి చెందిన సోదరులు దోపిడీ చేస్తూ, దోచుకుంటూ కర్కషమైన జీవితం సాగించేవారు. ఒకనాడు కలలో శ్రీరాముడు కనిపించి వారికి జ్ఞానోదయం కలిగించాడనీ తర్వాత పరివర్తన చెందిన మనసులతో గర్భగుడిని నిర్మించి స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారని అందుకే ఆ ఊరికి ఒంటిమిట్ట అనే పేరొచ్చిందనీ స్థానికుల కథనం..
గర్భగుడిలోని విగ్రహాలన్నీ ఏక శిలా నిర్మితాలు. ఆ విగ్రహాలను స్వయంగా జాంబవంతుడే ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అన్ని రామాలయాలలో ఉన్నట్టు హనుమంతుడు గర్భగుడిలో కాకుండా ఆలయం వెలుపల సంజీవ రాయుడిగా కొలువై ఉండడం మరో ప్రత్యేకత. మేఘనాథుడి శరా ఘాతానికి మూర్చపోయిన లక్ష్మణునికి సంజీవని తెచ్చి ప్రాణదానం చేసిన దానికి ప్రతీకగా ఆంజనేయుడిని సంజీవ రాయుడిగా కొలుస్తారు.
తొలుత చోళుల తర్వాత విజయనగర రాజుల నిర్మాణ శైలిలో, అద్భుత కళా రూపాలతో అంగరంగ వైభవంగా రూపుదిద్దుకున్న శిల్ప సౌందర్యం వేటికవే ప్రత్యేకం. తన భారతదేశ యాత్రలో ఒంటిమిట్టను సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ ‘భారతదేశపు అత్యుత్తమ కట్టడాలలో ఇది తప్పకుండా ఉంటుంది” అంటూ ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు. పోతనామాత్యునికి, ఇతర ప్రముఖులకు కేటాయించిన మాన్యం భూములకు సంబంధించిన ప్రాచీన శిలా శాసనాలు నేటికీ దర్శనమిస్తాయి. సాధారణంగా నవమినాడు జరగాల్సిన సీతా రాముల కళ్యాణం ఒంటిమిట్టలో నవమి తర్వాత వచ్చే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆరుబయట వెన్నెల్లో నిండు చంద్రుడి సాక్షిగా జరగడం కూడా మరో ప్రత్యేకత.
విష్ణుమూర్తి లక్ష్మీదేవిల వివాహం పగటి పూట జరగడంతో నేను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడైన చంద్రుడు విష్ణువును వేడుకోగా రామావతారంలో నీ కోరిక తీరుస్తానని వరమిస్తాడనీ, అందుకోసమే నవమి నాడు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాటి నిండు పున్నమి వెన్నెల సాక్షిగా ఒంటమిట్టలో వివాహం జరిపిస్తాడనీ పురాణ గాథొకటి ప్రాచుర్యంలో ఉంది. చైత్ర మాసంలో శ్రీరామ నవమి ముందు రోజు నుంచి పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోతన జయంతి, గరుడ సేవ, సంజీవ రాయుని సేవ, చుతుర్ధశి నాడు కళ్యాణం, రథోత్సవం, చక్ర స్నానం, ఏక్ంత సేవ ముఖ్యమైనవి. పూజలన్నీ ప్రాశ్చ్య రాత్రాగమ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి.
ఇక్కడి స్వామి వారు కులమతాలకతీతమైన వారు. మాల ఓబన్న చేత స్వామి వారికి హారతి ఇప్పించడం, టిప్పు సుల్తాన్ ప్రతినిథైన ఇమాంబేగ్ స్వయంగా స్వామి వారి మహిమలను స్వయంగా వీక్షించి భక్తుల సౌకర్యార్థం ఒక బావిని కూడా తవ్వించడం అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. భాగవతాన్ని రాయ సంకల్పించిన బమ్మెర పోతన ఒంటిమిట్ట కోదండ రామున్ని తలుచుకుంటూ “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రాముండట” అంటూ అంకితమివ్వడం ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చాటుతోంది.