శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకొని శయనించి ఉండటం వలన ఈ పుణ్యస్థలానికి అనంతశయనము అనే పేరు వచ్చినది అని అంటారు. ఇక్కడ తన నాభి యందు బ్రహ్మదేవుడు కొలువు దీరిన పద్మాన్ని కల్గి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభుడు. అయితే స్వామివారు కొలువై ఉన్న ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడి సరస్సులో ఒక మొసలి ఉండగా, ఈ మొసలి ఎవరికీ ఎలాంటి హాని అనేది చేయదు, రోజు పూజారి పెట్టె పరమాన్నం మాత్రమే తింటుంది. ఈ ఆలయంలో గత 70 ఏళ్లుగా మొసలి ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? స్వామివారికి అంగరక్షకుడిగా ఉండే మొసలి గురించి మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రం, తిరువనంతపురం లో అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. శ్రీ అనంత పద్మనాభస్వామి వారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకొని శయనించి ఉండటం వలన ఈ పుణ్యస్థలానికి అనంతశయనము అనే పేరు వచ్చినది అని అంటారు. ఇక్కడ తన నాభి యందు బ్రహ్మదేవుడు కొలువు దీరిన పద్మాన్ని కల్గి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభుడు. అయితే కేరళ రాష్ట్రంలో కాసర్ గోడ్ జిల్లాలోని అనంతపురం సరోవర మందిరం ఉంది. ఈ ఆలయం చుట్టూ సరస్సులతో రెండు ఎకరాల స్థలంలో ఉంది.
ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, పూర్వం శ్రీమహావిష్ణువు భక్తుడైన బిల్వమంగళుడు ఇక్కడి సరస్సు వద్ద తపస్సు చేసుకుంటూ ఉండగా అతని వద్దకు ఒక బాలుడు రాగ, ఆ బాలుడికి ఎవరులేరని తెలియడంతో తన దగ్గరే ఉండమని బాలుడికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. అయితే నన్ను ఎప్పుడు ఇబ్బందిపెట్టకూడదు, అవమానించకూడదు, ఒకవేళ నన్ను ఏదైనా అంటే నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని ఆ బాలుడు చెప్పడంతో దానికి బిల్వమంగళుడు సరేనని ఆశ్రయాన్ని ఇచ్చాడు. అయితే ఎప్పుడు అల్లరిచేసే ఆ బాలుడి చేష్టలకి ఒకసారి బిల్వమంగళుడు మందలించడంతో ఒక గుహలోకి వెళ్ళిపోతాడు.
బిల్వమంగళుడు బాలుడు సరస్సు పక్కన ఉన్న ఒక గుహలోకి వెళ్లడం చూసి బాలుడిని వెతుకుంటూ ఆ గుహలోకి వెళ్లగా చివరకు ఆ గుహ నుండి తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికి చేరుకున్నాడు. గుహలో బాలుడు అదృశ్యం అవ్వడం, గుహ నుండి వెళితే స్వామివారి ఆలయానికి చేరుకోవడంతో ఇన్ని రోజులు తనతో ఉన్నదీ శ్రీమహావిష్ణువే అని గ్రహించి అక్కడి సరస్సులోని గుడిని కట్టించాడు. ఆ ఆలయమే అనంతపురం సరోవర మందిరం. అయితే అనంతపద్మనాభుడి మూలస్థానం కావడంతో ఈ ఆలయానికి, గ్రామానికి ఆ పేరే వచ్చినదని చెబుతారు.
ఇది ఇలా ఉంటె ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయ సరస్సులో ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి పేరు బాబియా. అయితే సరస్సులో ఉండే ఈ ముసలి నీటిలోని చేపలను తినదు. శాకాహారమే తింటుంది, అదికూడా ఆలయ పూజారి పెట్టె పరమాన్నం మాత్రమే తింటుంది. ప్రతి రోజు ఆలయ పూజారి ఉదయం, మధ్యాహ్నం భోజనం పెట్టె సమయంలో మాత్రమే ఆ మొసలి సరస్సు నుండి బయటికి వస్తుంది. దాదాపుగా 70 సంవత్సరాలు ఆలయ సరస్సులో మొసలి ఉంటుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ సరస్సులో ఇది మూడవ మొసలి కాగా, ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి అనేది సరస్సు లో కనిపిస్తుంది. ఇక సరస్సు మధ్యలో ఈ ఆలయం ఉండగా, చుట్టూ ఈ సరస్సుకి అనుసంధానంగా సముద్రం, నది వంటివి లేకున్నా ఈ మొసలి ఎటునుండి వస్తుందనేది ఎవరికీ తెలియదు.
ఇది అంత దైవలీల గా, మొసలి స్వామివారి మరొక రూపమని, అనంతపద్మనాభుడి అంగరక్షకుడని భక్తులు భావిస్తున్నారు. ఈవిధంగా ప్రకృతి అందాల నడుమ రెండు ఎకరాల స్థలంలో సరస్సు మధ్యలో ఉన్న అనంతపద్మనాభస్వామిని దర్శనం చేసుకోవడానికి, ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా సరస్సులో ఉండే మొసలి ని చూడటానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.