శివుడు వెలసిన ప్రసిద్ధ దేవాలయాలలో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. శివుడు బృహస్పతిగా పేరుతో పిలువబడుతున్న ఈ ఆలయంలో పూర్వం ఆయన్ని ఇక్కడ దేవతలు ఆపద్బాంధవుడిగా కొలిచారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఎందుకు దేవతలు ఇక్కడ శివుడిని ఆపద్బాంధవుడిగా కొలిచారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కుంబకోణంలో ఆలంగుడిలో గురు గ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. శివుడు ఈ ఆలయంలో గురువు బృహస్పతి పేరుతో దక్షిణామూర్తిగా పూజలందుకుంటున్నాడు.
ఇక పురాణానికి వస్తే, క్షిరసాగర మధనంలో ముల్లోకాలను దహించివేసేంత వేడితో హాలాహలం బయటికిరాగా, దాని ధాటికి దేవతలందరు తట్టుకోలేకపోతుంటే బోళాశంకరుడు ఆ గరళాన్ని సేవించి గొంతులో నిలుపుకున్న చోటు ఇదేనని స్థల పురాణం. ఇలా ఆపద నుండి గట్టెకించిన శివుడిని దేవతలు ఆపద్బాంధవుడిగా కొలిచారు. విషాన్ని మింగిన శివుడు ఇక్కడే దేవదానవులకు జ్ఞాన బోధ చేసి గురు దక్షిణామూర్తిగా వెలిశాడని పురాణం.
ఇక ఆలయ విషయానికి వస్తే, గురుడికి ఇష్టమైన గురువారం నాడు సంక్రమణం గురుగ్రహం ఒక్కొక రాశిని దాటే రోజుల్లోను ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పసుపు పచ్చటి వస్త్రాలు, శనిగలు స్వామికి సమర్పిస్తారు. గురుగ్రహానికి సంబంధించి దోషాలు ఉన్న వారు ఈ గుడి చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే దోషాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం. చదువులో వెనకబడిన విద్యార్థులు ఈ స్వామిని దర్శించి నానబెట్టిన శనిగలతో కట్టిన మాలవేసి పూజిస్తే తప్పక ఉత్తీర్ణులవుతారని విశ్వాసం.
ఈ స్వామిని అరణ్యేశ్వర లింగంగా భావిస్తారు. ఈ ఆలయానికి గురుగ్రహ దోషాలు ఉన్నవారు అధిక సంఖ్యలో వస్తుంటారు.