కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీన్నుంచి బయటపడాలని ప్రజలు విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారిని తరిమేయడానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇక చేసేదేమి లేక కరోనా తో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు. కరోనా రాకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. అయినా ఆ మహమ్మారి బారిన పడినట్లైతే దాని నుండి కాపాడుకోడానికి ఇమ్మ్యూనిటి పవర్ ని పెంచుకోవాలి.
శరీరంలోకి ప్రవేశించే హానికర క్రిములు, వైరస్‌లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ తోడ్పడుతుంది. అలాంటి రోగ నిరోధకతను పెంపొందించే ఎన్నో పదార్ధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే.. అనారోగ్య సమస్యలకు వీలైనంతా దూరంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం….
1. తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఒక టీ స్పూన్ తులసి ఆకు రసం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె, బ్లాక్ పెప్పర్‌తో కలిపి దీన్ని తీసుకుంటే మరీ మంచిది.
2. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గ్రీన్ టీ కూడా రోగ నిరోధకత పెంపొందించే సాధనంగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడమే కాకుండా, బరువు తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ.. శరీరంలో కొలెస్ట్రాలను తగినట్టుగా నియంత్రించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తోంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అందులో ఉండే పాలి ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్.. తాపజనక వ్యాధులు, సీజనల్ దగ్గు, జలుబు నుంచి రక్షించడానికి సాయపడతాయి.
3. గ్రీన్ టీకి దాల్చిన చెక్క, పసుపు కూడా కలిపితే ఆ మిశ్రమం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గడం, జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరిచే చర్యలను మరింత వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తని మరింతగా పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
4. పసుపు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియని భారతీయులు ఉండరు. పసుపు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ లక్షణాలు ఇందులో మెండుగా ఉంటాయి. పసుపు యాంటీ సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. అందుకే, గాయాలైన చోట పసుపును పెడతారు. ఉదయాన్నే గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో తగినంత పసుపు, నిమ్మ, అల్లం, కొద్దిగా తేనె కలుపుకుని తాగినట్లయితే ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. పసుపు కలిపిన పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక వంటకాల్లో కూడా నిత్యం పసుపును వాడటం ద్వారా శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
5. వంటల్లో రిఫైండ్ ఆయిల్ కి బదులు కొబ్బరినూనెను ఉపయోగించాలి. కొబ్బరినూనెలో లారెక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఉంటాయి. అవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
6. వెల్లుల్లిలో కూడా ఎన్నో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఒక టీ స్పూన్ వెల్లుల్లికి కొంచెం తేనె కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
7. ద్రాక్ష, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, కొకోవ్, డార్క్ చాక్లెట్ వంటివి కూడా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు, ఇవి హానికారక వైరస్ లతో పోరాడతాయి.
8. ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, రక్తస్రావ నివారిణి లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప ఔషదం. ఉదయం వేళల్లో ఒక స్పూన్ ఉసిరి పొడిన మజ్జిగలో వేసుకుని కలుపుకుని తాగండి. అలాగే, ఉసిరి-కొబ్బరితో తయారు చేసిన చట్నీలను టిఫిన్లలో కలుపుకుని తినడం ద్వారా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.