శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం ఇచ్చే తిరుమల తిరుపతి దేవాలయానికి ప్రపంచ గుర్తింపు అనేది ఉంది. అయితే తిరుమలలో కాకుండా ఈ ఆలయంలో కూడా ఆ వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశాడని పురాణం. అందుకే ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం, రావులపాలెం పట్టణంకు సుమారు 10 కి.మీ. దూరంలో వాడపల్లి అనే గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయం గౌతమి నది తీరాన తూర్పు ముఖంగా ఉంది. ఈ క్షేత్రం యందు మూలవిరాట్టు స్వయంభూమూర్తి.
ఇక్కడ విశేషం ఏంటంటే, కోస్త ప్రాంతంలో మూడు స్వయంభూమూర్తులుగా వేంకటేశ్వరస్వామి వారు వెలసిల్లినారు. పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలో వాడపల్లి మరియు విశాఖజిల్లాలో ఉపమాక, ఈ మూడు స్వయాంభుమూర్తులను ఏకకాలంలో దర్శించుట అనాదిగా వస్తున్న ఆచారం అని చెబుతారు.
రక్తచందనం అంటే ఎర్రచందనం అనే కొయ్యనందు ఈ స్వామివారు ఉత్భవించారని చెబుతారు. అయితే మూడు వందల సంవత్సరాలకు పూర్వమే, గోదావరి నది తీరాన ఇసుకనందు లభ్యమైన మూర్తిగా స్థానికులు చెబుతారు. ఈ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా గాను, సంతానం ఇచ్చే దైవంగాను ఎంతో పేరు పొందినాడు.
ఇక గర్భాలయంలో శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం సభామండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం కలిగిన ప్రధానాలయం తూర్పు ముఖంగా ఉంది. ముఖమండపం నందు ఉత్తరాభిముఖంగా శ్రీ వేణుగోపాలస్వామి వారు, దక్షిణాభిముఖంగా గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఇంకా ఆండాళమ్మ సన్నిధిలో శ్రీ మహాలక్ష్మి దేవిని కూడా దర్శించగలము.
ఇలా వెలసిన ఈ స్వామివారికి నిత్య పూజలతో పాటు, ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం మరియు గోదావరి నదిలో తెప్పోత్సవం ఘనంగా, వైభవంగా జరుగుతాయి.