This Guy’s Sincere Love Letter To Legendary Director Kodi Ramakrishna Will Hit You Right In The Feels

అప్పటికి నా వయసు ఓ 6 లేదా 7 ఏళ్ళు.. ఈటీవీలో “అమ్మోరు” సినిమా వస్తుంది. మొదటి ఓ అరగంట వరకూ అంతా సరదాగానే వెళ్లిపోయింది. రామిరెడ్డి ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. సరదా స్థానంలో భయం, గగుర్పాటు వచ్చాయి. ఒక సన్నివేశంలో ఆ చిన్న పిల్లాడు ఎక్కడ బావిలో పడిపోతాడో అని సౌందర్య కంటే ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఇక రామిరెడ్డి క్షుద్రపూజలు చేస్తూ ముఖాన్ని చేతుల్లో దాచుకొని మరీ కదలకుండా టీవీకి అతుక్కుపోయాను. ఇక ఆఖరిలో అమ్మోరు తల్లి వచ్చి రామిరెడ్డి తల నరికితే సౌందర్య ఎంత సంతోషపడిందో తెలియదు కానీ.. టీవీలో సినిమా చూస్తున్న నేను మాత్రం విశేషమైన ఆనందంతో, ఒకరకైమైన సంతృప్తితో ఊగిపోయాను. కళ్ళు చిదంబరం భయపెడుతున్నాడో, భయపడొద్దు అని వారిస్తున్నాడో అర్ధం కాలేదు కానీ.. ఆరోజు రాత్రి నా కలలో రామిరెడ్డి, కళ్ళు చిదంబరం పోటీపడి మరీ వచ్చారు.

1-anji

ఆ తర్వాత మళ్ళీ టీవీలోనే ‘దొంగాట” సినిమా చూస్తూ జగపతిబాబు మన సౌందర్య బ్యాగ్ వెతకడానికి కష్టపడుతున్నప్పుడల్లా “ఆర్రే మళ్ళీ నక్లెస్ దొరకలేదే” అని బాధపడేవాడ్ని, జగపతిబాబులా దొంగ అయితే హ్యాపీగా బ్రతికేయోచ్చన్నమాట అనే ఆలోచన సైతం వచ్చింది. “దేవి” అనే సినిమా కూడా టీవీలోనే ఏదో పండక్కి వేశారు. ఇంట్లో పండగ వాతావరణంతో కళగా ఉన్నప్పటికీ.. ఆ “దేవి” సినిమా చూస్తూ ఉండిపోయాను. ఆ విలన్ ను చూసి “ఈ జుట్టుపోలిగాడు” తొందరగా సచ్చిపోతే బాగుండు మా దేవి & ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు” అని ఆ దేవుడికి ప్రార్ధన చేసేంత అమాయకత్వం నాది.

2-Anji

అలా చేశాను కూడా. అప్పుడప్పుడే థియేటర్లలో సినిమాలు చూడడం మొదలెట్టాను.. పోస్టర్ చూసి వద్దు బాబోయ్ ఈ దేవుళ్ళ సినిమా అని ఏడ్చుకుంటూనే థియేటర్లో “దేవుళ్ళు” సినిమా చూశాను. ఆ తర్వాత స్కూల్లో “నీ ప్రేమ కోరే చిన్నారులం” అని డ్యాన్స్ కూడా చేశాను. అప్పటికి కోడి రామకృష్ణ అనే పేరు నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం లేని వయసు అది. ఇప్పట్లా అప్పట్లో యూట్యూబ్ లేదు, సో సినిమా ప్రోమోలు గట్రా జెమిని చానల్ లో వచ్చే “బయోస్కోప్” అనే ప్రోగ్రామ్ లో చూసేవాడ్ని.. “దేవీ పుత్రుడు” ప్రోమోలు విపరీతంగా నచ్చేశాయి. రాజమండ్రి జయరాం టాకీస్ దగ్గర లైన్ లో నిలబడి.. పోలీస్ లాఠీ దెబ్బ కొద్దిలో మిస్ అయ్యి (ముఖం చూసి పిల్లాడ్ని అని వదిలేశాడు).

4-Ammoru

మొత్తానికి మూడు టికెట్స్ సంపాదించి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాను. సినిమా చూస్తున్నంతసేపూ ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిన అనుభూతి. థియేటర్ బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ చిన్న పాప నాతోపాటే నడుస్తున్న అనుభూతి. అప్పుడు మొట్టమొదటిసారి జనాల్లో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను.. “కోడి రామకృష్ణ మామూలుగా తీయలేదురా.. ఇరగ్గోట్టేశాడు.. ఆ గ్రాఫిక్స్ ఏంట్రా బాబు అలా ఉన్నాయ్” అని ఆ అన్న పొగుడుతుంటే అర్ధమైంది.. ఆ సినిమాలో సగంపైగా గ్రాఫిక్స్ అని. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత “అంజి” సినిమా థియేటర్లో చూశాను. అసలే చిరంజీవికి అభిమానిని అవ్వడం వల్ల ఇంకాస్త ఎక్కువగా సినిమాలో లీనమైపోయాను. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక చివర్లో మూడో కన్ను తెరిచిన శివుడ్ని చూసి నిజంగానే శివ సాక్షాత్కారం జరిగింది అనుకున్నాను. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమా వీక్లీలో కలెక్షన్స్ గురించి చదివితే తప్ప తెలియలేదు ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యిందని. జనవరి 14, 2009.. “అరుంధతి” సినిమా రిలీజ్ అవుతుంది అని మా నాన్న నన్ను, చెల్లిని బండి మీద హైద్రాబాద్ లోని గెలాక్సీ థియేటర్ కి తీసుకెళ్లారు. సినిమా రిలీజ్ అవ్వలేదని చెప్పడంతో నిరాశతో వెనక్కి వచ్చేశాం.

5-Kodi ramakrishna

జనవరి 15, 2009.. మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్. ఆఖరికి జనవరి 16న సినిమా రిలీజైంది. రెండు రోజులు లేట్ గా రిలీజైనా సినిమా క్రేజ్ లో ఏమాత్రం మార్పు లేదు. బండితోపాటు థియేటర్ లోకి వెళ్లడానికే 20 నిమిషాలు పట్టింది. ఇక సినిమా చూస్తున్నప్పుడు నేను జడుసుకొంటుంటే.. నా వెన్ను తట్టి “రేయ్ బుజ్జి భయపడకురా.. అది సినిమా” అని మా నాన్న నాకు కనీసం ఒక అయిదారుసార్లు చెప్పారు. ఆ రేంజ్ లో నేను భయపడిన ఏకైక సినిమా “అరుంధతి”. ఈ సినిమా దర్శకుడు కూడా కోడి రామకృష్ణ అని తెలిసాక.. ఆయన కాబట్టే ఇలా తీయగలిగాడు అని చాలా గట్టిగా నమ్మాను. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో మళ్ళీ ఆస్థాయి సినిమా రాలేదు. కానీ.. ఒకట్రెండుసార్లు వేరే సినిమాల విషయంలో ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సినిమాల షూటింగ్ సమయాల్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పినప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఆ తలకి అలా క్లాత్ ఎందుకు కడతారండీ అని నేను అడిగినప్పుడు.. “ఈ ప్రశ్న ఇప్పటికీ చాలా మంది అడిగారు కానీ.. నీ అంత అమాయకంగా మాత్రం ఎవరూ అడగలేదయ్యా!” అని నవ్వుతూ సమాధానం చెప్పినప్పుడు మురిసిపోయాను. “నేను ఒక శ్రామికుడిని.. మాపల్లెలో గోపాలుడు షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్‌ ‘మోకా రామారావు’ నా దగ్గరకు వచ్చి.. “మీ నుదిటి భాగం చాలా పెద్దది. అసలే ఇది వేసవి కాలం. ఎండలో ఇలా మాడిపోకూడదు’ అని చెప్పి కర్చీఫ్ తో ఇలా కట్టాడు.. ఆ తర్వాత ఒక బ్యాండ్ తెచ్చి కట్టాడు.

6-Kodi ramakrishna

అప్పట్నుంచి బాగుందని అలా మైంటైన్ చేస్తున్నా అని మరోసారి చెప్పారు. అదే ఆయనతో ఆఖరి మీటింగ్. మళ్ళీ కొన్ని ఈవెంట్స్ లో ఆయన్ని చూడడం తప్పితే దగ్గరకి వెళ్ళి మాట్లాడలేదు. నా బిడియమే అందుకు కారణం. కానీ ఆయన మాత్రం ఎప్పుడు నన్ను చూసినా గుర్తుపట్టి ఆత్మీయంగా నవ్వేవారు. నిన్న నేనేదో సినిమా చూస్తుండగా.. ఆయన చనిపోయారన్న వార్త విని షాక్ అయ్యాను. మొదట ఏదో ఫేక్ న్యూస్ అనుకున్నాను కానీ.. సీనియర్ మీడియా రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేసేసరికి నిజం అని నిర్ధారించుకొని నిశ్చేష్టుడనయ్యాను. అందరూ వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లలో ఆయన ఫోటోలు పెట్టి “RIP” అని పెడుతుంటే.. ఆయన భౌతికంగా మాత్రమే కదా మన మధ్య లేరు అనిపించింది. ఈలోపే మనసులో బాధతో కూడిన చిన్న ఆనందం.. ఆయన మన మధ్య లేడు కానీ ఆయన సినిమాలు చిరకాలం ఉంటాయి కదా.. ఆయన సినిమా చూస్తున్నప్పుడల్లా ఆయన్ను తలుచునే ప్రతి మనసులో ఆయన బ్రతికే ఉంటాడు కదా అని ఒక సంతృప్తి. అందుకే.. ఆయన చనిపోయినప్పుడు బాధపడలేదు.. ఇంకొన్ని సినిమాలు తీయకుండా వెళ్ళిపోయినందుకు కోప్పడ్డాను. అందుకే.. ఐ హేట్ యూ కోడి రామకృష్ణ గారూ!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR