హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి. మనకి ఎలాంటి కష్టం వచ్చిన ఆంజనేయుని తలచుకుంటే చాలు మనసు నిబ్బరంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయుడు బాలాంజనేయస్వామిగా పూజలందుకొనుచున్నాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని కూకట్ పల్లి బాగ్ అమీర్ పేటలో శ్రీ బాలాంజనేయస్వామి దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న బాలాంజనేయస్వామిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం వస్తుందని పరాశరసంహితలో తెలియచేయబడింది.దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో చెట్టు చేమలతో, చిన్న చిన్న గుట్టలతో ఉండేది. అయితే ఇక్కడ ఉన్న గుట్ట పైన ఒక చిన్న శిల ఉండేది. దాని పైనే ఆంజనేయస్వామి వెలిశారని చెబుతారు. అయితే పూర్వం కొందరు పాదచారులు ఇప్పుడు ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంత దారిలో వెళుతూ మహాశివరాత్రి సందర్భంగా శివారాధన చేయాలనీ నిశ్చయించుకొని ఉండగా, అక్కడే సంచరిస్తున్న ఒక సన్యాసి అయినా భక్తుడు వీరాంజనేయస్వామి రూపంలో కొండపైన ఒక శిల ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అది చూడటానికి వెళ్లిన భక్తులకి కొండపైన సుందర రూపుడైన రుద్రవీర్య సముద్బవ ఆంజనేయస్వామి రూపం దర్శనం ఇచ్చింది. అప్పుడు వారందరు కలసి ఆ కొండను చిన్న దేవాలయంగా మలిచారు. అదే నేడు ఎంతో మహిమగల పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ ఆలయంలో ప్రధానంగా ఆంజనేయస్వామి వారు నెలకొని ఉండగా ఈశాన్యంగా నవగ్రహాలు, నైరుతి భాగంలో భవాని అమరేశ్వరస్వామి వారి సన్నిధి, ఆగ్నేయంలో నాగదేవత, గణపతి, భవాని అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఇది సర్వదేవతా ఆలయంగా భక్తులు చెప్పుకుంటారు. ఈ ఆలయంలో కార్తీకమాసంలో విశేష ఆరాధనలు, పూజలు, క్షిరాభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా మహాశివరాత్రి ఉత్సవాలు, జ్వాలాతోరణం మొదలగు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.