ఎండాకాలంలో ఎక్కువ మంది ఎదర్కొనే సమస్య డీ హైడ్రేషన్. శరీరంలో నీరు ఇంకిపోవడం వల్ల నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. శరీరం నీరు లేకుండా సరిగా పనిచేయదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రెగ్యులర్ హైడ్రేషన్ ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది ప్రజలు రోజూ తగినంత నీరు త్రాగడానికి కష్టపడతారు. రోజుకు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని తెలుసు, కాని కొన్నిసార్లు సాదా నీరు విసుగు తెప్పిస్తుంది. అందుకే నీటికి దోసకాయను జోడించడం వల్ల కొంత అదనపు రుచి వస్తుంది, ఎక్కువ తాగడానికి ప్రోత్సహిస్తుంది.
దోసకాయ నీరేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆరోగ్యానికి చేటు చేసే రసాలు, సోడాలు మరియు ఇతర పానీయాల కేలరీలు లేకుండా రుచిని జోడించి దోసకాయ నీరు తాగితే డీహైడ్రేషన్ నుండి బయటపడొచ్చు. పైగా ఇంట్లోనే దోసకాయ నీటిని తయారు చేసుకోవచ్చు. దోసకాయ వల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
దీనికోసం మొదట దోసకాయలను ముక్కలు ముక్కలు ఆ తరిగి, వాటిలో చిటికెడు ఉప్పు వేసి అందులో లీటర్ నీరు పోసి సమానంగా కలపాలి. దాన్ని కొంతకాలం పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. లేదా గది నార్మల్ ఉష్ణోగ్రతలో కూడా అలాగే ఉంచవచ్చు. ఆ తర్వాత వాటిని తాగడానికి ఉపయోగించాలి. ఈ దోసకాయ నీళ్ళలో నిమ్మ, నారింజ, పైనాపిల్, పుదీనా లేదా తులసి ఆకులు వంటి వాటిని కూడా కలపవచ్చు. ఇలా తయారు చేసిన దోసకాయ నీరు రెండు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.
వేసవిలో ప్రధానంగా వేధించే డీ హైడ్రేషన్ సమస్యను అరికట్టడానికి దోసకాయ నీరు చక్కగా పని చేస్తుంది. శరీరంలో నీటిని అంత తొందరగా ఇంకిపోకుండా ఉంచుతుంది. దోసకాయలో యాంటీఆక్సిడెంటల్ లక్షణాలు ఉంటాయి. దానివల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకి నెట్టివేయబడతాయి. దోసకాయ నీటిని తాగడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. దోసకాయలో ఉండే సిలికా కణజాలాలను పటిష్టం చేస్తుంది.
దోసకాయలలో ఎక్కువ మొత్తంలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి మరియు మన కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. దోసకాయలలో కుకుబిటిసిన్స్ మరియు లింగాన్స్ అనే పోషకాలు కూడా ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దోసకాయలో కనిపించే పొటాషియం ఎలక్ట్రోలైట్ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
దోసకాయ నీరు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు దోసకాయ నీటిని డైట్ లో యాడ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ఉన్న మచ్చలు పోవడానికి, ముఖం అందంగా కనిపించడానికి దోసకాయ నీరు చాలా తోడ్పడుతుంది. నోటి దుర్వాసనని పోగొడుతుంది.
దోసకాయ లో విటమిన్ బి 5 ను మంచి మొత్తంలో ఉండటం వల్ల ప్రతిరోజూ దోసకాయ నీరు త్రాగటం మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. దోసకాయలోని పొటాషియం శరీరంలోని కండరాల కణజాలాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ దోసకాయ నీరు తాగడం వల్ల కండరాలు లోపల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. మరియు వ్యాయామం తర్వాత శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఒక్కోసారి బ్రష్ చేసుకున్న తరువాత కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. నలుగురిలో మాట్లాడలేక తాము అనుకున్నది చెప్పలేక నోటి దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్య ఉన్నవారు దోసకాయ నీరుని తాగితే చాలా మేలు కలుగుతుంది.