కుంకుమ పువ్వు అంటే గర్భవతిగా ఉన్నవాళ్లు పాలల్లో కలుపుకొని తాగుతారని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ వంటల కోసం వాడే కుంకుమ పువ్వుతో.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాస్త ఖరీదెక్కువైనా ఈ సుగంధ ద్రవ్యం స్థూల కాయం సమస్యకు చక్కటి పరిష్కారమని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం 15 నుంచి 20 సెంటీమీటర్లు పెరిగే కుంకుమ పువ్వు ప్రత్యేకతలే వేరు. ఆకలిని చంపే గుణాలుండడంతో ఒబేసిటీ తదితర సమస్యలకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
ప్రస్తుతం కరోనా సోకి చాలా మంది రికవరీ అవుతున్నా ఒబేసిటీ లాంటి సమస్యలతో ఇబ్బందిపడుతూ రికవరీ అవడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆర్గానిక్ పంట ఉత్పత్తుల కన్నా కూడా.. కుంకుమ పువ్వుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మేలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒబేసిటీ సమస్యకు కుంకుమ పువ్వు వాడితే సరి అంటున్నారు. కుంకుమపువ్వులోని ఔషధ గుణాలు జీర్ణ కోశాన్ని శుభ్రపరచడం ,రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఆకలిని పెంచటంతో పాటు జీర్ణక్రియకు సహాయ పడతాయి.
కీళ్ల నొప్పులు.. సంతాన సాఫల్య సమస్యలకు.. ఆయుర్వేద వైద్యంలో కుంకుమ పువ్వు బెస్ట్ అంటున్నారు. మన పూర్వీకులు కూడా దీని ప్రత్యేకతలు గుర్తించి వెజ్ అయినా.. నాన్ వెజ్ అయినా.. వండిన వంటలో మంచి కలర్.. సువాసన కోసం కుంకుమ పువ్వును ఉపయోగించారట. కేవలం వంటలు.. ఔషధాల తయారీలో మాత్రమే కాదు కాస్మెటిక్స్ లోనూ కుంకుమ పువ్వును ఉపయోగిస్తున్నారు. కుంకుమ పువ్వు వల్ల ఆడవారికే చాలా ప్రయోజనాలుంటాయనుకుంటారు. అయితే మగవారికి కూడా కుంకుమపువ్వు వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. కుంకుమ పువ్వులో ఉండే మాంగనీస్ శరీరానికి ప్రశాంతత చేకూర్చుతుంది. తర్వగా నిద్రపోయేలా చేసే గుణం కుంకుమపువ్వుకు ఉంటుంది. కాస్త కుంకుమ పువ్వు తీసుకుని కాస్త గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగండి. ఒత్తిడి తగ్గించి బాగా నిద్ర పడుతుంది. కుంకుమపువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్ మెమొరీ పవర్ ను పెంచుతుంది. ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్ లో కూడా కుంకుమ పువ్వు కలుపుకోవచ్చు. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.