తల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండా, బేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిని జీర్ణం చేసుకోవడానికి బేబీకి తక్కువ శక్తిసరిపోవడం వలన, మిగిలిన శక్తి శరీరం యొక్క ఇతర విధుల,పెరుగుదల, అవయాల అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉంటాయి. మన అధ్యయనానికి అందేవి కేవలం 400 రకాల పోషకాలే. వాటని కృత్రిమంగా తయారు చేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాల విశిష్టతను చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఏమిటంటే… వాటికి ప్రత్యామ్నాయంగా రకరకాలైన ఫార్మూలా ఫీడ్స్ అందుబాటులో ఉన్నా, అవేవీ తల్లిపాలకు సాటిరావు. కృత్రిమంగా తయారు చేద్దామన్నా… దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాధ్యంకాలేదంటే తల్లిపాల గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రిమెచ్యుర్ బేబీస్‌లో తల్లిపాల మేలు :
తల్లిగర్భంలో పూర్తి వ్యవధి పాటు లేకుండా త్వరగా పుట్టేసే (ప్రిమెచ్యుర్ బేబీస్) పిల్లల్లో గుండె గదులు (ఛేంబర్లు) ఒకింత చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక గుండెపోటుకు గురయ్యే అవకాశాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయట. ఇలాంటి పిల్లలకు వీలైనంతవరకు రొమ్ముపాలే పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్లు, గ్రోత్‌ఫ్యాక్టర్లు వంటివి సమకూరుతాయి.
తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. దాంతో వారి వైద్య అవసరాల కోసం, వారి రక్షణ (కేర్) కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని మనలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
తల్లిపాలలోని ముఖ్యమైన అంశాలు :
నీరు: తల్లి పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది.
ప్రోటీన్లు: తల్లి పాలలో 75% వరకు ప్రోటీన్లు ఉంటాయి.
కొవ్వులు:
శరీరానికి అవసరమైన ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్‌తోపాటు… లాంగ్ చైన్ పాలీ ఆన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అని పిలిచే పోషకాలూ ఇందులో ఉంటాయి. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్‌ఏ అనే కొవ్వు ఉంటుంది. డీహెచ్‌ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్ యాసిడ్ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వులతో నిర్మితమై ఉంటుంది. ఈ కొవ్వులలోనూ 93 శాతం ఈ డీహెచ్‌ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వులూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్‌ఏ (ఆరాకిడోనిక్ యాసిడ్) అంటారు.
మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్‌ఏ సమకూర్చుతాయి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వులన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వులు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వుల రిజర్వ్ ఉంచుకోవాలి. పైగా బిడ్డ కంటి చూపు బాగుండాలంటే కూడా ఇవే కొవ్వులు కావాలి. ఎందుకంటే రెటీనా కూడా కొవ్వులతోనే నిర్మితమవుతుంటుంది. ఇక బిడ్డ ఈ లోకంలోకి వచ్చాక ఇవే కొవ్వులు రెండేళ్ల పాటు అందుతుండాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల ఉంటుంది. అందుకే అన్నిరకాల పోషకాలతో పాటు, ఈ కొవ్వులనూ (ఫ్యాటీ యాసిడ్స్‌ను) తల్లిపాలు సురక్షితంగా అందజేస్తుంటాయి.
తల్లిపాలతో మరిన్ని ఉపయోగాలు :
కేవలం మెదడు ఎదుగుదలకూ, కంటి చూపు సునిశితత్వానికే కాకుండా ఈ కొవ్వులు చిన్ని గుండెకూ తగినంత బలాన్ని సమకూర్చుతాయి.
చిన్నిబిడ్డల మెదడు విషయానికి వస్తే దానిలోని ‘గ్రే–మ్యాటర్’ నిర్మాణానికి ఈ కొవ్వులే ఎక్కువగా ఉపకరిస్తాయి. తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే భవిష్యత్తులో వాళ్లను గుండెజబ్బులనుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం.
పిండిపదార్థాలు:
పాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ల్యాక్టోజ్ అనేది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్.
ఇతర పోషకాలు :
పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి.
తల్లిపాలు లేని పిల్లల్లో తలెత్తే సమస్యలు :
తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి.
జీర్ణకోశ సమస్యలు:
తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి.
ఆస్తమా :
పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ.
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్థూలకాయం పెద్దయ్యాక డయాబెటిస్ వంటి సమస్యలను ఆ సమస్యలు మరెన్నో ఇతర రుగ్మతలను తెచ్చిపెడతాయన్న విషయం తెలిసిందే కదా. అలాంటి వాటిని నివారించాలంటే చిన్నప్పుడు తల్లిపాలు పట్టడం తప్పనిసరి.
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (ఛైల్డ్‌హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే.