ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా పేరు ఎంతగా వినిపిస్తుందో శానిటైజర్ పేరు కూడా అంతగా వినిపిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. శానిటైజర్ వాడకం ఎక్కువైంది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకోవడం అలవాటుగా మారింది. బయటికి వెళ్లి ఇంటికొచ్చే వరకు పలుమార్లు చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారు. చివరికి వంట చేసే సమయంలో కూడా శానిటైజర్ పూసుకోవడం మానడం లేదు. ఆడుకొనే పిల్లల చేతులను కూడా శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. అయితే శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో… అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవంటున్నారు.
బయటికి వెళ్ళినపుడు సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం కుదరదు కాబట్టి చాలా మంది శానిటైజర్లనే ఉపయోగిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్‌తో తయారు చేసిన శానిటైజర్ల వినియోగం ఎక్కువగా వుంది. అందులో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అదే క్రిములను నాశనం చేస్తుంది. అయితే వీటిని అధికంగా వాడటం వల్ల చేతిపై వుండే చర్మం దుష్ప్రభావాలకు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన మంట, చర్మం పొడిబారడం, ఎర్రబడటం వంటి చర్మ సమస్యలను ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఆల్కహాల్ కలిగి ఉండడంతో ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో మండే స్వభావం ఉంటుంది. శానిటైజర్ చేతికి రాసుకొని వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందువల్ల చేతికి రాసుకున్న శానిటైజర్ ఆరిన తర్వాతే పనులు చేయడం మేలు. ఇక కొందరు తుమ్మినా దగ్గినా శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదట.. దీనివల్ల మన శరీరానికి, చేతులకు సహజ సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి స్థాయి తగ్గుతుందంటున్నారు.
శానిటైజర్లను అతిగా వాడడం వల్ల అలర్జీ, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి. వీలైతే చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. చాలా మంది శానిటైజర్ వాడిన తర్వాత అదే చేతితో ఆహారం తీసుకుంటారు. ఇది సరికాదు. శానిటైజర్ రాసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా చనిపోతాయి కానీ ఈ ద్రావణంలో ఉండే రసాయనాలు మాత్రం చేతిపైనే ఉండిపోతాయి. అదే చేతితో ఆహారం తీసుకుంటే ఆ రసాయనాలు మన శరీరంలోకి వెళతాయి.
అందువల్ల శానిటైజర్‌ను అవసరం మేరకే వాడాలి కానీ అదే పనిగా వాడకూడదు. వీటిని ఎక్కువగా వాడితే వైరస్, క్రిములు తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడమే మేలని.. సుమారు 20 సెకన్ల పాటు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల క్రిముల బారినపడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.