తిరుమల వెంకన్నస్వామి కళ్యాణ వెంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చే అద్భుత ఆలయం

0
1833

తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. తిరుమలకి కొంత దూరంలోనే ఉన్న ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి కళ్యాణ వెంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలోని స్వామివారు తిరుమల మూర్తి కంటే పెద్దదిగా చెబుతారు. ఇంకా శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారితో కొంతకాలం ఈ ప్రదేశంలో నివసించారని పురాణం. మరి ఎన్నో విశేషాలు, అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Venkateswaraఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. ఇక్కడి శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న మూర్తికంటే పెద్దస్వామివారు. తిరుమలలో జరిగే అన్ని రకాల పూజలు ఈ ఆలయంలోని స్వామివారికి కూడా జరుగుతాయి. ఈ ఆలయం చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండే తిరుమల కొండపైకి మెట్లదారి ఉన్నదీ. ఇదే తిరుమలకి మొదటిదారి అని, ఇక్కడి నుండి తిరుమల చాలా దగ్గర అని చెబుతారు.

Lord Venkateswaraఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారిని నారాయణవనం లో వివాహం చేసుకొని తిరుమల కొండమీద వెలిసేముందు పద్మావతి అమ్మవారితో కొంతకాలం ఇక్కడ గడిపారని పురాణం. ఇంకా పూర్వం ఈ స్వామివారు ఒక భక్తుని కలలో కనిపించి, నేను ఇక్కడ భూమిలో ఉన్నానని చెప్పడంతో, ఆ భక్తుడు కొందరి సహాయంతో ఇక్కడ వెతికి చూడగా, ఒకచోట స్వామివారి విగ్రహం వారికీ కనిపించింది. అప్పుడు ఆ భక్తుడు సంతోషించి ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసాడు. ఆ తరువాత కొంతకాలానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించింది.

Lord Venkateswaraతిరుపతి అలిపిరి మెట్ల దారి కంటే  ఇక్కడి నుండి వెళ్లే దారి చాలా దగ్గర అని చెబుతారు. ఇక్కడి నుండి ఒక గంట సమయంలోనే తిరుమలకి చేరుకోవచ్చు. అయితే ఒకప్పుడు మంగాపురం లో రైల్వేస్టేషన్ ఉండగా భక్తులు ఇక్కడ దిగి ఈ ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకొని, ఇక్కడి నుండే తిరుమలకి వెళ్లేవారు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకొని గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలను కట్టుకుంటే పెళ్లికాని వారికీ ఆరు నెలల్లో పెళ్లి అవుతుందని భక్తుల విశ్వాసం.

Lord Venkateswaraఈ విధంగా తిరుమలకి దగ్గరలోని ఈ  శ్రీనివాస మంగాపురం ఆలయంలో  కొలువై ఉన్న  కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Lord Venkateswara