Rakshabandhan – Here’s Everything You Need To About Rakhi Festival

0
1909

రక్తసంబంధం ఉన్న లేకున్నా కులమతాలకు అతీతంగా భారతదేశం మొత్తం జరుపుకునే పండుగ రాఖీ. మన హిందూ సంప్రదాయ పండుగలలో అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటిచెప్పేది ఒక్క రాఖి పండుగ అనే చెప్పవచ్చు. మరి అసలు రాఖీ పండుగ ఎలా మొదలైంది? రాఖి పండుగ చరిత్ర ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Rakshabandhan

రాఖీ పౌర్ణమిని శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రాఖి పండుగనే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ కేవలం సోదరి సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా అత్మియులమధ్య ఐకమత్య పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం జరుగుతుంది. దేవతల కాలం నుండి రాఖి ప్రస్తావన ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

Rakshabandhan

ఇక విషయంలోకి వెళితే, దేవతలకి, రాక్షసులకు పుష్కరకాలం పాటు యుద్ధం జరుగగా ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయి ఒక చోట తలదాచుకుంటాడు.ఆ సమయంలో ఇంద్రుడి భార్య అయినా ఇంద్రాణి తన భర్తకి విజయం కలగాలని దేవతలందరినీ పూజించి ఒక రక్షాను ఇంద్రుడి చేతికి కడుతుంది. అప్పుడు ఇంద్రుడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. ఈవిధంగా రాఖీ పుట్టిందని కొందరు చెబుతారు.

Rakshabandhan

ఇక మహాభారతం విషయానికి వస్తే, శ్రీ కృష్ణుడి మేనత్త సాత్వతి కి శిశుపాలుడు అనే కుమారుడు అందవికారంగా జన్మిస్తాడు. అయితే ఎవరు నీ కుమారుణ్ణి ఎత్తుకుంటే వీడి వికారాలన్నీ పోతాయో, ఆ మహానుభావుడి చేతిలోనే వీడు మరణిస్తాడు. అతను తప్ప యింకెవరూ వీణ్ణి చంపలేరు అని ఆకాశవాణి పలికింది. ఒకసారి బలరామకృష్ణులు మేనత్త సాత్వతిని చూడటానికి వాళ్ళ యింటికి వెళ్ళారు. సాత్వతీదేవి వాళ్ళను కుశల ప్రశ్నలడిగి కొడుకును మొదట బలరాముడి చేతికిచ్చింది. తర్వాత కృష్ణుడి చేతికి అందించింది. కృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడు సాధారణ రూపంలోకి మారిపోతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. కాని సాత్వతి మాత్రం భయపడుతూ, కృష్ణా, ఈ శిశుపాలుడు నీకు మేనత్త కొడుకు. వీడొక వేళ దుర్మార్గుడై నీకు ఇష్టం లేని పని చేసినా, నీకు అన్యాయం తలపెట్టినా క్షమించి విడిచిపెడతానని మాట ఇచ్చి నా పై దయచూపి పుత్ర భిక్ష అనుగ్రహించు అంటూ కృష్ణుణ్ణి బతిమాలుకుంది. అప్పుడు కృష్ణుడు మేనత్త మీద ఉన్న అభిమానం కొద్దీ ఆమె మాట మన్నించి, అత్తా! నూరు తప్పులవరకూ వీణ్ణి క్షమిస్తానని నీకు మాట ఇస్తునానను. ఆ తరువాత విధి లిఖితం. నా చేతులలోనే వీడు చావవలసి ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు అన్నాడు. ఇలా శిశుపాలుడు పెద్దవాడై ఒక రాజ్యానికి రాజు అయ్యాడు. రాజుగా అయి ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడు శ్రీకృష్ణుడితో గొడవ పడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండేవాడు. ఈవిధంగా ఒకరోజు నిండు సభలో శ్రీకృష్ణుడిని గోరంగా అవమానిస్తూ ఉండగా దాంతో వందవ తప్పు పూర్తవడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడు శిరస్సుని ఖండిస్తాడు. అప్పుడు సుదర్శనచక్రం వేగంగా విసిరినందుకు శ్రీకృష్ణుడి వ్రేలు తెగి రక్తం కారడంతో అందరు కట్టు కట్టడానికి అటు ఇటు పరిగెత్తుతుండగా ద్రౌపతి మాత్రం అక్కడే ఉంది తన చీర కొంగు చించి శ్రీకృష్ణుడి వ్రేలుకి కట్టు కడుతుంది. అప్పుడు ఆమెకు తనమీదగల ఆ సోదర ప్రేమకు శ్రీకృష్ణుడు కష్టకాలములో ఆదుకుంటానని ఆమె రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధానికి నాందిగా నిలిచిందని చెబుతారు

Rakshabandhan

ఇంకా ఓసారి రాక్షస రాజైన బలి చక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెపుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.

Rakshabandhan

ఇక క్రీస్తు పూర్వం 326లో గ్రీస్‌ రాజైన అలెగ్జాండర్‌ భారతదేశం పైన దండెత్తడానికి వచ్చి రోక్సానా అనే యువతిని పెళ్లిచేసుకుంటాడు. ఇక ఆ సమయంలో భారతదేశాన్ని పురుషోత్తముడు పరిపాలిస్తుండగా అలెగ్జాండర్‌ అతడిపైకి యుద్దానికి వెళ్తాడు. అయితే పురుషోత్తముని పరాక్రమం గురించి ముందే తెలుసుకున్న రోక్సానా ఆ చక్రవర్తికి ఓ రాఖీని పంపి, తన భర్తను ఏం చేయద్దని కోరింది. ఇక యుద్ధంలో పురుషోత్తముడు తన చేతి మణికట్టుకి ఉన్న రాఖీని చూసి యుద్ధంలో అలెగ్జాండర్‌ని చంపకుండా వదిలివేశాడు.

Rakshabandhan

ఈవిధంగా ఎన్నో కథలుగా చెప్పుకునే రాఖి పండుగ అంటే ఒక నమ్మకంతో, ప్రేమతో, అనుబంధంతో కూడుకున్న ఒక ఆచారంగా వస్తుంది. ఇక సంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్ర్తాలు చెబుతున్నాయి.