ఎనిమిది వందల ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం గురించి తెలుసా ?

అతిపురాతన ఆలయాలు మనదేశంలో అనేకం ఉన్నాయి. వాటి నిర్మాణం చూస్తే చాలు ఆనాటి సైన్స్‌ తెలుస్తుంది. నేటి ఆధునిక సాంకేతికతకు ఏమాత్రం తీసిపోని నిర్మాణాలు. అలాంటి అద్భుత ఆలయంలో ఒకటి నేడు తెలుసుకుందా

Highlights of the oldest Perumal templeశ్రీవాసుదేవపెరుమాళ్ ఆలయం… పేరు వింటే, ఎక్కడో తమిళదేశంలోని వైష్ణవాలయమని అనుకుంటాం. కానీ కాదు, శ్రీకాకుళానికి వంద కిలోమీటర్ల దూరంలో… ఆంధ్రప్రదేశ్ – ఒరిస్సా సరిహద్దులోని మందస ప్రాంతంలో ఉంది. ఎనిమిది వందల ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తయిన కొండలు. శ్రీకాకుళం- ఒరిస్సా సరిహద్దులోని వాసుదేవపెరుమాళ్ ఆలయాన్ని సందర్శిస్తే…సమస్త వైష్ణవ క్షేత్రాలనూ దర్శించినంత ఫలమని చెబుతారు. వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి ఎంతో ఐతిహాసిక ప్రాధాన్యం ఉంది.

Highlights of the oldest Perumal templeదేవకి అష్టమగర్భంలో జన్మించే బిడ్డే… తన ప్రాణాల్ని హరిస్తాడని తెలుసుకున్న కంసాసురుడు దేవకీవసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. పుట్టిన పిల్లలందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారా దంపతులు. చెరసాలలోని చిమ్మచీకట్లను తరిమేస్తూ …వేయి సూర్యుల వెలుగుతో నాలుగు చేతులతో…శంఖ, చక్ర, గద, అభయ ముద్రలలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి… తన కృష్ణావతార రహస్యాన్ని వివరిస్తాడు. అచ్చంగా అదే స్వరూపం శ్రీవాసుదేవపెరుమాళ్లదని వైష్ణవాచార్యులు చెబుతారు. కంచిలో కొలువైన వరదరాజ స్వామి కూడా ముమ్మూర్తులా ఇలానే ఉండటం విశేషం. ఆరు అడుగుల ఆ శిలామూర్తి వైకుంఠవాసుడిని కళ్లముందు నిలుపుతుంది.

Highlights of the oldest Perumal templeవాసుదేవ పెరుమాళ్ ఆలయం ఎనిమిది వందల ఏళ్లనాటిదని చెబుతారు. నిర్మాణ శైలిని బట్టి చూసినా, చాలా ప్రాచీనమైందనే అర్థమౌతుంది. ఎందుకంటే, కోణార్క్ సూర్య దేవాలయం సహా అనేకానేక ఆలయాల నిర్మాణశైలి ఇక్కడ ప్రతిబింబిస్తుంది. కొన్ని కోణాల్లో పూరి జగన్నాథుడి ఆలయాన్ని కూడా గుర్తుకుతెస్తుంది. ఆలయాన్ని ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు. మూడువందల సంవత్సరాల క్రితం మందస ప్రాంతాన్ని పాలించిన మణిదేవమహారాజు వైష్ణవ ధర్మం మీద గౌరవంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. చినజీయరు స్వామి గురువైన పెద్దజీయరు స్వామి ఇక్కడే శ్రీభాష్యం చదువుకున్నారు. ప్రాచీన కళింగాంధ్ర ప్రాంతంలో వైష్ణవానికి ఈ ప్రాంతం మూల కేంద్రంగా వర్ధిల్లింది. అందులోనూ, ఇక్కడి ఆచార్యులు…మందస రామానుజులు వేదాంత విద్యలో నిష్ణాతులు. కాశీ వరకూ వెళ్లి విద్వత్ గోష్ఠులలో పాల్గొన్నారు, మహామహా దిగ్గజాలను ఓడించి ప్రశంసలు అందుకున్నారు.

Highlights of the oldest Perumal templeఆ పండితుడి దగ్గర శ్రీభాష్యం నేర్చుకోవాలన్నది పెద్దజీయర్ స్వామి, ఆయన స్నేహితుడు గోపాలాచారి కోరిక. రాజమండ్రి నుంచి మందస దాకా కాలినడకనే వెళ్లారు. గురువులకు ప్రణమిల్లి శ్రీభాష్యం నేర్పించమని కోరారు. ఆయన సంతోషంగా అంగీకరించారు. రెండేళ్లు అభ్యసించాల్సిన శ్రీభాష్యాన్ని ఆరు నెలల్లో ఆపోశన పట్టి, రాజమహేంద్రానికి చేరుకున్నారు. తన గురువూ ఆధ్యాత్మిక మార్గదర్శీ స్వయంగా విద్య అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీయర్ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగుచేయించారు చినజీయరు స్వామి. వందల ఏళ్లనాటి ప్రాచీనతకూ, శిల్పకళా చాతుర్యానికీ ఏమాత్రం భంగం కలగకుండా ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం, వందల ఎకరాల మాన్యం లేకపోయినా… ఏలోటూ రానీయకుండా స్వామివారికి నిత్యోత్సవాలు నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు.

Highlights of the oldest Perumal templeశ్రీదేవీ భూదేవీ సమేత పెరుమాళ్ స్వామి, చిన్ని కృష్ణుడు, గోదాదేవి సన్నిధిలోని విష్వక్సేనుడు, నమ్మాళ్వార్, భగవత్ రామానుజులు, తిరుమంగై ఆళ్వార్, గరుడాళ్వార్ వంటి విగ్రహాలతోపాటూ 25 పంచలోహ మూర్తులున్నాయి. పక్కనే గోపాల సాగర జలాశయం ఉంది. ఏటా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో చక్రతీర్థ వేడుకలు ఇక్కడే జరుగుతాయి. శ్రీకాకుళం నుంచి 100 కిలో మీటర్లూ, వైజాగ్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. పలాస రైల్వే స్టేషన్లో దిగీ వెళ్లవచ్చు. శ్రీకాకుళం అనగానే గుర్తుకువచ్చే అరసవిల్లి, శ్రీకూర్మంతో పాటూ రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR