Home Health వర్షాకాలం పాదాల ఎలా సంరక్షించుకోవాలి

వర్షాకాలం పాదాల ఎలా సంరక్షించుకోవాలి

0

వర్షాకాలం వచ్చిందంటే చాలు సహజంగానే బాక్టీరియ‌ల్‌, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాప్తి చెందుతుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పాదలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ‌ర్షాకాలంలో పాదాలు ఎక్కువ సార్లు వ‌ర్ష‌పు నీటిలో బుర‌ద‌, మురికి నీటిలో త‌డుస్తుంటాయి. దీంతో పాదాల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అంతటితో ఆగకుండా రకరకాల చర్మ వ్యాధులకు కారణమవుతాయి.

2-Mana-Aarogyam-796క‌నుక ఈ సీజ‌న్‌లో పాదాల‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. వ‌ర్షంలో కాళ్లు బాగా త‌డిచినా, మురికి నీళ్ల‌లో కాళ్ల‌ను ఉంచినా, బుర‌ద నీటిలో త‌డుస్తూ వ‌చ్చినా పాదాలు దుర‌ద‌గా మారుతాయి. అందుకు గాను కొద్దిగా నిమ్మ రసం, వెనిగ‌ర్ ల‌ను క‌లిపి దుర‌ద ఉన్న చోట రాయాలి. కొంత సేపు ఆగి వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేయాలి. దీంతో దుర‌ద తగ్గుతుంది.

పాదాలపై స‌హ‌జంగానే చ‌ర్మానికి సంబంధించిన మృత క‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో అవి పాదాల‌కు అతుక్కుని పోతాయి. క‌నుక వాటిని వదిలించుకోవాలి. అందుకు గాను పాదాల‌ను రోజూ స్క్ర‌బ్బ‌ర్ స‌హాయంతో రుద్దాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తే పాదాల‌పై ఉండే మృత క‌ణాలు పోతాయి. పాదాలు మృదువుగా మారుతాయి. రోజూ రాత్రి నిద్రించే ముందు పాదాల‌కు కొబ్బ‌రినూనెను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉద‌యం వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేయాలి. ఇలా చేస్తే పాదాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ సీజ‌న్‌లో పాదాల‌పై సూక్ష్మ క్రిములు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక రోజూ వాటిని తొల‌గించుకోవాలి. అందుకు గాను పాదాల‌ను త‌ప్ప‌నిసరిగా రోజూ వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డ‌గాలి. ఒక బ‌కెట్‌లో కొద్దిగా హిమాల‌య‌న్ సాల్ట్ వేసి అందులో పాదాల‌ను 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. లేదా వెచ్చ‌ని నీళ్లలోనూ పాదాల‌ను ఉంచ‌వ‌చ్చు. దీంతో పాదాల‌పై ఉండే దుమ్ము, ధూళి కూడా పోయి పాదాలు అందంగా క‌నిపిస్తాయి.

వర్షంలో తడిసినా, వర్షపు నీటిలో నడిచినా ఇంటికి రాగానే కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. కాలివేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో షూస్ ధరించకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు లేదా వర్షపు నీటిలో నడిచినపుడు షూస్ బాగా తడిసి పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్‌కు బదులుగా తేలికగా ఉండే స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి.

రోజూ షూస్‌ ధరించే వారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్సులను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే వాటిని శుభ్రంగా ఉంచుకున్నా కూడా ఒక్కోసారి బాక్టీరియా వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ వాతావరణంలో బాక్టీరియా పెరుగుతుంది. దీంతో సహజంగానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసేశాక కూడా ఆ దుర్వాసన అలాగే ఉంటుంది.

అది తగ్గాలంటే పాదాలపై కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి సున్నితంగా మర్దనా చేయాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేయాలి. దీంతో పాదాలపై ఉండే బాక్టీరియా నశిస్తుంది. పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. పాదాల నుంచి సువాసన వస్తుంది. లేదా కొబ్బ‌రినూనెకు బ‌దులుగా ఆల్మంగ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను కూడా వీలును బట్టి రాయ‌వ‌చ్చు. ఇవి కూడా పాదాల‌ను సంర‌క్షిస్తాయి.

బ్లాక్‌ టీలో ట్యానిక్‌ యాసిడ్లు ఉంటాయి. ఇవి దుర్వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో పాదాలకు సంరక్షణ లభిస్తుంది. అలాగే చెమట తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్స్‌ వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత బ్యాగ్స్‌ను తీసేసి అందులో మరింత నీటిని కలపాలి. కొంతసేపు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 15-30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. బాక్టీరియా నశిస్తుంది. పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Exit mobile version