ప్రస్తుతమున్న బిజీ బిజీ జీవితంలో వయసుతో సంబంధం లేకుండా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే అధికం. గుండెలో మంట తరచుగా చాలా మంది అనుభవిస్తుంటారు. అజీర్తి కోసం తీసుకొనే ఔషధాలు, ఇతర చర్యలతో ఛాతీలో మంట రాకుండా ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా మనం జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె లేదా ఛాతీలో మంటను అనుభవిస్తాము. ఒక్కొక్కసారి మంట గాకుండా నొప్పి కూడా అనిపించవచ్చు. పొట్టలో ఉండే పదార్థాలు అన్నవాహిక కింది భాగం వైపుకు ప్రయాణించినపుడు అసౌకర్యం లేదా నొప్పి కలుగుతుంది.
అసలు ఇలా గుండెలో మంట కలగడానికి కారణం ఏంటి? అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో మంట వ్యాధి లక్షణమే కానీ వ్యాధి కాదు. గుండె లేదా ఛాతీలో లేదా అన్నవాహిక వెంబడి మంట ఉన్నట్లయితే ఇసోఫాగ్నస్‌లో (అన్నవాహికలో) మంట వుండటమే కారణం. ఛాతీ ఎముక కింద అన్నవాహిక ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఏర్పడినప్పుడు గుండె, ఛాతీలో మంట కలుగుతుంది. పొట్టలోని కండరాల్లో లోపం ఉండటం కూడా గుండె మంటకు దారి తీస్తుంది.
పొట్టలోని పైభాగంలో వుండే ఫ్లాప్ (అటు ఇటు కదిలే భాగం) ఆహారం అన్నవాహిక నుండి తిరిగి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని సమయాల్లో ఫ్లాప్ సరిగా పనిచేయకపోవటం వలన పొట్టలో యాసిడ్స్ పైకి వెళ్ళిపోతాయి. అలా యాసిడ్స్ పొట్టనుండి పైకి వచ్చినపుడు గుండె లేదా ఛాతీలో మంట వస్తుంది. సోడాలు, కార్పోనేటెడ్ పానీయాలు చాక్‌లెట్స్, పుల్లటి పండ్లు, టమాటోలు, టమాటో సాస్ లు, సుగంధ ద్రవ్యాలతో చేసిన పదార్థాలు, ఎర్ర మిరియాలు (కాస్పికం) పిప్పర్‌మెంట్, స్పియర్‌మెంట్, బటానీ లాంటి ఎండు గింజలతో చేసిన పదార్థాలు, ఐస్‌క్రీమ్ లాంటి ఫ్యాటీ ఆహార పదార్థాలు కూడా గుండె మంటకు దారి తీస్తాయి.
నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెలో మంట వస్తుంది. ఎందుకంటే ఇవి అరగడగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలానే మనం బయట బజ్జీలు మొదలైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తింటూ ఉంటాం. వీటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. లాక్టోస్ జీర్ణం అవ్వడానికి ఎంజైమ్స్ అవసరం. ఎంజైమ్లు లేకపోవడం లేదా తక్కువగా ఉండడం వల్ల జీర్ణమవడం కష్టమవుతుంది.
మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి డైట్ లో మసాలా తో చేసే వంటలు తగ్గించండి. అలానే పప్పులు, రాజ్మా, బీన్స్ వంటివి కూడా ఎక్కువ తీసుకొద్దు.
సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అనుకుంటాం కానీ సిట్రస్ ఫ్రూప్ట్స్ వలన కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది. అలానే క్యాబేజీ, బ్రోకలీ, ముల్లంగి వంటివి కూడా జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి గుండెల్లో మంట వస్తే వీటికి కూడా దూరంగా ఉండటం మంచిది.
ఒత్తిడి, అలసట లాంటివి ఎదుర్కొన్నపుడు, ఇతర మానసిక స్థితి కూడా గుండె మంటకు కారణం అవుతుంది. అలాగే పొగత్రాగడం, మితిమీరి తినడం, అధిక బరువు, ఛాతీ బిగుసుకుపోయే లాంటి వస్త్రాలు ధరించటం వలన కూడా గుండె మంటకు దారి తీస్తాయి. గుండె మంట అదుపులోకి రాకపోతే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. కనుక గుండెలో మంటతో బాధపడే వాళ్ళు స్మోకింగ్ కి దూరంగా ఉండండి.
వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం ప్రతి రోజూ అర గంట పాటు వ్యాయామం చేస్తే సమస్యలు తగ్గిపోతాయి. గుండెలో మంట కూడా రాదు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా గుండె లో మంట తగ్గుతుంది. కూరగాయలు, చేప, పౌల్ట్రీ మొదలైనవి తీసుకోండి. ఇలా మీరు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.