పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన జనమంతా కరోనా దెబ్బకు జడిసి మళ్ళీ సంప్రదాయ ఆహారాల వైపు పరుగులు పెడుతున్నారు. సహజంగా రోగ నిరోధక శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పసుపు, తులసి, అల్లం, లాంటివి నిత్య జీవితంలో భాగమయ్యాయి. అక్కడితో ఆగకుండా పల్లెల్లో, పొలాల్లో దొరికే ఆకులు, అలములు వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై చిన్న పాటి పరిశోధనలే చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇప్పపూవ్వు కూడా చేరిపోయింది.
ఇప్పపువ్వు అడవిలో దొరికే ప్రకృతి ప్రసాదం.. ఈ పువ్వు వాసన గుప్పుమంటుంది.. దానితో చేసిన సారా మత్తెక్కిస్తుంది. తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో ఇప్ప సారా చాలా ప్రసిద్ధి. అడవిలో విరివిగా దొరికే ఈ పువ్వు స్థానిక జనాలకు ఆదాయ వనరు కూడా. ఆదివాసీ గ్రామాల్లో ఇప్పచెట్టును పెర్సపేన్ దేవతగా కొలుస్తారు. అయితే మనకు తెలిసినట్టు దీంతో ఒక్క సారానే కాదు.. ఎన్నో వంటలు చేయొచ్చు. గిరిజనులకు ఇప్పపువ్వు లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఇప్పలో అనేక పోషకాలు ఉంటాయి. ఇప్ప పువ్వు ఆరోగ్యానికి మంచిది కూడా.
ఇప్పపువ్వుతో తయారుచేసిన లడ్డు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ “సి” ఉందని, ఇవి రక్తహీనతను దూరం చేస్తాయని, జీర్ణశక్తిని పెంచుతాయని జాతీయ పోషకాహార సంస్థ గుర్తించడం విశేషం. మనదేశంలో మెజార్టీ ఆడవాళ్లలో రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం చూస్తూనే ఉన్నాం. గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఏజెన్సీ ప్రాంత మహిళల్లో ఆ పరిస్థితి మరీ దారుణం. అక్కడ గర్భిణుల్లో హిమోగ్లోబిన్ 3నుంచి 5శాతం కూడా ఉండక ఎర్ర రక్త కణాలు తగ్గపోతున్నాయి.
దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గర్భిణుల్లో లక్షమందిలో 152మంది, వెయ్యి మంది అప్పుడే పుట్టిన శిశువుల్లో48 మంది చనిపోతున్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలు మరణిస్తున్నారు. ఇవన్నీ అరికట్టడానికి గిరిజన సంక్షేమ అధికారులు ఓ మార్గం ఎంచుకున్నారు. ఇప్ప పువ్వులో ఉండే ఐరన్ కు రక్త హీనత తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను గర్భిణులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటిని ఆరు నెలలు గర్భిణులకు అందించనున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత, పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో రానున్న రోజుల్లో ఉత్పత్తిని పెంచి అంగన్ వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సైతం అందించాలనేది అధికారుల ఆలోచన. ఇప్ప చెట్టు పూలు, పండ్లు, కాయలు మరియు చెట్టు బెరడు మొదలైన వాటికి విశేషమైన ఔషధ గుణాలు ఉంటాయి . అందుకే ఇప్పచెట్టు ను కల్పవృక్షం అని పిలుస్తారు.
ఇప్ప పువ్వులు బియ్యం, ఆపిల్, మామిడి, అరటి, ఎండు ద్రాక్ష వంటి పదార్థాల కన్నా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇప్ప పువ్వు లో చక్కెరలు, మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి. మానవ శరీరానికి కావలసిన అతిముఖ్యమైన ఖనిజ లవణాలయిన క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ మరియు పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీ కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ఇప్పపువ్వు లలో అధికంగా ఉంటాయి.
ఈ చెట్టు బెరడు నుండి తయారు చేసిన డికాషన్ ను పుండ్లకు మరియు దురదకు లేపనంగా వాడుతారు. కాల్చిన ఇప్ప చెట్టు ఆకుల బూడిదకు వెన్న లేదా నెయ్యి కలిపి ఆయింట్మెంట్ లాగా చేసి గాయాలకు మరియు పుండ్లకు మందుగా వాడుతారు. పంటి చిగుళ్ల నుండి వచ్చే రక్తస్రావం సమస్యను అరికట్టడానికి కూడా బెరడు డికాక్షన్ ను వాడుతారు. బెరడు డికాషన్ కు చక్కెర వ్యాధిని నియంత్రించే గుణం ఉంది.
ఇప్ప పూలను దగ్గు మరియు శ్వాసకోశ సమస్యల నివారణ కు మందులాగా వాడుతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలల్లో కలుపుకొని పాలిచ్చే తల్లులు తాగడం ద్వారా పాల ఉత్పత్తి చేసే గ్రంధులు ఉత్ప్రేరకం చెంది పాలు అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్ప కాయల నుండి తీసిన నూనెను వంట నూనెగా మరియు చర్మ సంబంధ వ్యాధుల కు మందుగా వాడుతారు. నూనె తీసిన ఇప్ప కాయ చెక్కను పశువుల దాణ లాగా, ఎరువుగా మరియు సబ్బు /డిటర్జెంట్ తయారీ లో వాడుతారు.