Home Health ఆలస్యం అవుతుందని బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్తున్నారా?

ఆలస్యం అవుతుందని బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్తున్నారా?

0

ఉదయం ఆలస్యంగా లేచారా? ఆఫీస్ కి, స్కూల్, కాలేజీ కి ఆలస్యం అవుతుందని హడావిడిగా రెడీ అయి వెళ్లిపోయారా? ఈ కంగారులో బ్రేక్ ఫాస్ట్ చేయడం మరిచిపోయారా? సరేలే ఒక్క పూటకి ఏమైంది డైరెక్ట్ గా లంచ్ చూసేద్దాం అని అనుకుంటే చాలా పొరపాటు. బ్రేక్ ఫాస్ట్ ప్రాధాన్యత తెలియక చాలా మంది స్కిప్ చేస్తుంటారు.

dosa breakfastపనులకు ఆలస్యమవుతుందని కొంతమంది, త్వరగా భోజనం చేసేయొచ్చులే అని కొంత మంది, వెయిట్ తగ్గాలని మరికొంత మంది బ్రేక్ ‌ఫాస్ట్ మానేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణులు చెప్పేదేమంటే.. ఈ రెండూ తప్పే. మనం ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మనకు రోజంతా ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేస్తుందని వారంటున్నారు. పోషకాలు అధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. అది రోజువారీ జీవనశైలిపై ప్రభావం చూపుతుంది అని అంటున్నారు.

రాత్రి భోజనం పూర్తి చేసిన తరువాత ఉదయం నిద్ర లేచేవరకు దాదాపు 12 గంటలు గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరానికి తగిన పోషకాలు అవసరం. శరీరం, మనసు యాక్టీవ్ గా ఉండాలి అంటే కేలరీలు అవసరం అవుతాయి. శరీరానికి పిండిపదార్థాలు కూడా అవసరం. ఆల్పాహారం వీటిని భర్తీ చేస్తుంది. పీచుపదార్ధాలు, పిండిపదార్థాలు, మాంసక్రుతులు, ఇతర న్యూట్రియంట్స్ ఉండేలా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

సరిగ్గా ఆల్పాహారం తీసుకోని వాళ్లు నీరసానికి గురి అయి త్వరగా చిరాకుగా పడే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా ఆల్పాహారం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ జీవక్రియను ప్రారంభిస్తుంది. రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది పనులను పూర్తి చేయడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. చేస్తున్న పనిపట్ల దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువును నివారించేందుకు బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే కండరాలు మరియు మెదడు పని చేయడానికి శరీరానికి అవసరమైన రక్తంలో చక్కెర సాధారణంగా తక్కువగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ దాన్ని తిరిగి నింపడానికి సహాయపడుతుంది.

అదీకాక శరీరానికి తగిన పోషకాలు అందకపోతే శక్తిని కోల్పోయినట్లు అనిపించవచ్చు. ఎలాగూ బ్రేక్‌ఫాస్ట్ తిన్లేదు కదా అని ఒక్కసారే లంచ్ కూడా ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం లేకపోతే పాలు, పండ్లు వంటివైనా తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల నుండి కొన్ని విటమిన్లు మరియు పోషకాలను పొందటానికి అవకాశం ఉంటుంది.

ఉదయాన్నే ప్రోటీన్ మరియు ఫైబర్‌తో ఆహారాన్ని తినడం వల్ల మధ్యాహ్న భోజన సమయం వరకు ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు ఉదయాన్నే తినడానికి ఇష్టపడదరు. కానీ వారి ఎదుగుదలకు బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. చురుకుగా ఉండలేరు. త్వరగా అలసిపోతారు. పిల్లలు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిని తినడానికి ఇష్టపడకపోతే పండ్లు, పీనట్ బటర్ లాంటివి ఇవ్వొచ్చు.

Exit mobile version