సీతారామలక్ష్మణులు దర్శనమిచ్చే ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నప్పటికి ఈ ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి ఒక పీఠంపై కొలువుదిరి ఉండటం విశేషం అయితే హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లు విగ్రహం ఆకర్షణీయం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయానికి దగ్గరగా ప్రసిద్ధమైన రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఒక గోపురం, మహామండపం, రాతి రథము ఉన్నాయి. దశావతారాలు, రామాయణ కథల శిల్పాలతో చెక్కబడిన ఏక రాతి స్తంభాలతో ఈ దేవాలయ మండపాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ ఆలయంలోని రథం మీద వామనకథ, మీనాక్షి సుందరేశుల వివాహ ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా సుగ్రీవ పట్టాభిషేకం కూడా చెక్కబడి ఉండటం ప్రత్యేకత.
ఈ ఆలయంలో ఉన్న కోనేరు చాలా విశాలమైనది. ఈ కోనేరు చుట్టూ ఒకేరీతిగా నిర్మింబడిన 16 మంటపాలు ఉన్నాయి. ఈ మంటపాలు 16 వ శతాబ్దంలో అచ్యుత నాయకరాజు మంత్రి గోవింద దీక్షితులు హైందవ మత సంప్రదాయం ప్రకారం రోజు చేసిన 16 దానాల జ్ఙానపకార్థం నిర్మించాడని తెలియుచున్నది. 20 ఎకరాల వైశాల్యం కలిగిన ఈ పెద్ద కోనేటిలో 20 బావులున్నాయి. మాఘమాసంలో భారతదేశంలో గల పుణ్యనదుల నదీజలాలు ఈ బావులలోకి ప్రవహిస్తాయని ప్రతీతి. ఇక్కడ మాఘమాసం అనే ఉత్సవం 12 సంవత్సరాలకి ఒకసారి అతి వైభవంగా జరుగుతుంది.
మాఘమాసంలో గరుడు సింహరాశిలో చేరినప్పుడు సౌరమాసం ప్రకారం 11 వ నెల పౌర్ణమి రోజున అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఈ ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి పుణ్యస్నానాలు చేసి తరిస్తారు.